
Donald Trump,Zelensky,Putin:పుతిన్, జెలెన్‌స్కీతో త్రైపాక్షిక భేటీకి ట్రంప్ సంసిద్ధత
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌కు తాము సంపూర్ణ భద్రత కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కోసం త్రైపాక్షిక సమావేశం నిర్వహిస్తామని ఆయన ప్రకటించగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కూడా దీనికి అంగీకారం తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగియవచ్చని, కానీ అది ఎప్పుడన్నది ఇప్పటికీ చెప్పలేమని ట్రంప్ వ్యాఖ్యానించారు. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలికే దిశగా సోమవారం ఆయన శ్వేతసౌధం ఒవెల్ కార్యాలయంలో కీలక చర్చలు జరిపారు.
వివరాలు
ఐరోపాకు భద్రతా హామీలు కోరిన నేతలు
ముందుగా ట్రంప్, జెలెన్‌స్కీతో సమావేశమై చర్చించుకున్నారు. అనంతరం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడెరిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌లెయన్ తదితర ప్రముఖ యూరోపియన్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఉక్రెయిన్‌తో పాటు తమ దేశాల భద్రతకూ అమెరికా నుంచి భరోసా కావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తక్షణ కాల్పుల విరమణకు గట్టి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనికి స్పందించిన ట్రంప్.."అది ఎంతవరకు ఫలితమిస్తుందో చెప్పలేం,కానీ కావాల్సిన ఒత్తిడి తప్పక తెస్తాను"అని సమాధానం ఇచ్చారు.
వివరాలు
యూరోపా దేశాలే మొదటి రక్షణ కంచె
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా త్వరలో ఫోన్‌లో మాట్లాడతానని ఆయన వెల్లడించారు. "యూరోపా దేశాలే మొదటి రక్షణ కంచె. వారికీ భద్రత కల్పించడం అమెరికా బాధ్యత. అలాగే ఉక్రెయిన్‌కు కూడా మా నుంచి సంపూర్ణ రక్షణ అందుతుంది. శాంతి ఒప్పందంలో భాగంగా నాటో తరహా భద్రత హామీలపై ఇంకా చర్చ జరగాల్సి ఉంది" అని ట్రంప్ వివరించారు. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ, తన సతీమణి వొలెనా జెలెన్‌స్కా రాసిన లేఖను ట్రంప్ భార్య మెలనియాకు అందజేశారు.
వివరాలు
రష్యా ఆక్రమించిన క్రిమియాను ఉక్రెయిన్ మరిచిపోవాల్సిందే: ట్రంప్
జెలెన్‌స్కీతో భేటీకి ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 12 ఏళ్ల క్రితం రష్యా ఆక్రమించిన క్రిమియాను ఉక్రెయిన్ మరిచిపోవాల్సిందేనని ఆయన సూచించారు. అలాగే నాటోలో చేరాలన్న ఉక్రెయిన్ ఆకాంక్షను వదులుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమ వేదిక 'ట్రూత్ సోషల్'లో స్పష్టం చేశారు. "జెలెన్‌స్కీ యుద్ధాన్ని వెంటనే నిలిపేయొచ్చు, లేదంటే కొనసాగించొచ్చు. కానీ ఒబామా పాలనలో రష్యాకు పోయిన క్రిమియాను తిరిగి పొందలేరు. నాటో సభ్యత్వం కూడా సాధ్యం కాదు. కొన్ని అంశాలు ఎప్పటికీ మారవు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వివరాలు
స్పందించిన రష్యా ప్రతినిధి మిఖాయిల్ ఉల్యానోవ్
తనకు మద్దతుగా నిలిచిన యూరోపా నేతలకు కృతజ్ఞతలు తెలిపిన జెలెన్‌స్కీ.."ఉక్రెయిన్‌ను రక్షించుకుంటానన్న నమ్మకం నాకు ఉంది. మా భద్రతకు సరైన హామీ లభిస్తుందని కూడా నమ్ముతున్నాను. రష్యా మొదలుపెట్టిన ఈ యుద్ధాన్ని అదే ముగించాలి" అని అన్నారు. ఈ నేపథ్యంలో రష్యా ప్రతినిధి మిఖాయిల్ ఉల్యానోవ్ కూడా స్పందించారు. ''ఉక్రెయిన్ శాంతి కోసం చాలా యూరోపా దేశాలు కృషి చేస్తున్నాయి. దీనికి రష్యా అంగీకరిస్తుంది. అయితే అదే రక్షణ హామీ మాకు కూడా అవసరం'' అని రష్యా ప్రతినిధి మిఖాయిల్ ఉల్యానోవ్ 'ఎక్స్' వేదికగా పోస్టు చేశారు.