Trump: ఇజ్రాయెల్ రాజకీయాలపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. ఇజ్రాయెల్‌లో తనకు 99 శాతం ప్రజాదరణ ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష పదవీకాలం ముగిసిన తర్వాత అవసరమైతే అక్కడ ప్రధాని పదవికి కూడా పోటీ చేసే అవకాశం ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ఇరాన్‌తో యుద్ధ అంశంపై ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ఎలాంటి ఆతురత లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌పై దాడుల అంశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఏం చర్చించారనే ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. నెతన్యాహు చాలా మంచి వ్యక్తి అని, తాను అనుకున్న పని తప్పకుండా చేస్తారని చెప్పారు.
వివరాలు
దేశ ప్రజలు సైన్యంపై పూర్తి విశ్వాసం ఉంచాలి
ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు తగిన గౌరవం దక్కడం లేదని కూడా అభిప్రాయపడ్డారు. ఒప్పందం కుదరకపోతే త్వరలోనే ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామని ట్రంప్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ సమయంలో తమ సాయుధ దళాలు శక్తిసామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకున్నాయని వెల్లడించారు. దేశ ప్రజలు సైన్యంపై పూర్తి విశ్వాసం ఉంచాలని కోరారు. అమెరికా మరోసారి యుద్ధానికి దారితీసే చర్యలు చేపడుతోందని ఆరోపించారు. అలాంటి పరిస్థితి తలెత్తితే దాడి చేసిన దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.