Gold Card Visa: డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన.. సంపన్న వలసదారుల కోసం 'గోల్డ్ కార్డ్' వీసా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో, పెట్టుబడిదారుల కోసం గత 35 ఏళ్లుగా అమలులో ఉన్న వీసా విధానాన్ని మార్చాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.
కొత్తగా 'గోల్డ్ కార్డ్' వీసాలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.ఈ వీసాల ద్వారా పెట్టుబడిదారులు అమెరికా పౌరసత్వం పొందడం సులభతరం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాలో కనీసం 5 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే వారికి ఈ 'గోల్డ్ కార్డ్' (Gold Card) మంజూరు చేయనున్నట్లు తెలియజేశారు.
వివరాలు
గ్రీన్‌కార్డ్‌లా శాశ్వత నివాస హోదా
''ఈ వీసా ద్వారా వచ్చే వ్యక్తులు అమెరికాలో మరింత ధనవంతులవుతారు,విజయాలు సాధిస్తారు. అలాగే,ప్రభుత్వానికి పన్నులు చెల్లించి,అనేక మందికి ఉపాధి కల్పిస్తారు.ఈ ప్రణాళిక అత్యంత విజయవంతం అవుతుందని మేము ఆశిస్తున్నాం''అని ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో ప్రకటించారు.
వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ మాట్లాడుతూ, ''మరొక రెండు వారాల్లో EB-5 వీసాలను 'ట్రంప్ గోల్డ్ కార్డ్'లతో భర్తీ చేయనున్నాం. ఇది కూడా గ్రీన్‌కార్డ్‌లా శాశ్వత నివాస హోదాను కల్పిస్తుంది. EB-5 ప్రోగ్రామ్ ద్వారా జరుగుతున్న మోసాలను, అక్రమాలను అరికట్టడమే మా లక్ష్యం. చట్టబద్ధంగా పెట్టుబడి పెట్టే వారికి పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించడానికే ఈ కొత్త విధానం'' అని వివరించారు.
వివరాలు
EB-5 వీసా ప్రోగ్రామ్ & గోల్డ్ కార్డ్ పరిచయం
1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన EB-5 వీసా విధానం ద్వారా అనేక మంది పెట్టుబడిదారులు అమెరికాలో స్థిరపడే అవకాశం పొందారు.
హోంల్యాండ్ సెక్యూరిటీ గణాంకాల ప్రకారం, 2021 సెప్టెంబరు నుండి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8,000 మంది ఈ వీసాలను పొందారు.
అయితే, ఈ విధానంలో మోసాలు జరుగుతున్నట్లు నాలుగు సంవత్సరాల క్రితం ఓ అధ్యయనం నిర్ధారించింది.
ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు 'గోల్డెన్ వీసా' విధానాన్ని అమలు చేస్తున్నాయి.
వివరాలు
'గోల్డ్ కార్డ్'కు పరిమితి ఉండదు
యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు సంపన్నులను ఆకర్షించేందుకు ఈ వీసాలను జారీ చేస్తున్నాయి.
ఇప్పుడు అమెరికా కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం EB-5 వీసాలకు సంవత్సరానికి పరిమితి ఉండగా, 'గోల్డ్ కార్డ్'కు అలాంటి పరిమితి ఉండదని ట్రంప్ ప్రకటించారు.
ప్రభుత్వ ఖజానాను బలోపేతం చేసేందుకు కోటి గోల్డ్ కార్డ్ వీసాలను జారీ చేయనున్నట్లు తెలియజేశారు.