
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. మూడవసారి ఎన్నిక కావడానికి మార్గాలున్నాయి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక అయ్యే అవకాశాలున్నాయని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు.
తన మూడోసారి బాధ్యతలు చేపట్టడాన్ని పూర్తిగా కొట్టిపారేయలేనని స్పష్టం చేశారు.
ఇది సరదాగా చెప్పిన జోక్ కాదని తేల్చిచెప్పారు.అయితే,ఈ విషయంపై ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈవిషయాన్ని ఆయన ఆదివారం జరిగిన ఎన్‌బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అమెరికా రాజ్యాంగంలోని 22వసవరణ ప్రకారం,ఒక వ్యక్తి మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సాధ్యపడదు.
అయినప్పటికీ,''చాలా మంది మళ్లీ పోటీ చేయాలని నన్ను కోరుతున్నారు.కానీ ఇప్పుడదే నా ప్రాధాన్యత కాదని వారికి చెప్పా.దానిపై ముందుగా ఆలోచించడం అవసరం లేదని మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై దృష్టి పెడుతున్నాను'' అని ట్రంప్ తెలిపారు.
వివరాలు
మళ్లీ అధికారం చేపడతారా?
అంతేకాదు, ''మళ్లీ అధికారం చేపడతారా?'' అనే ప్రశ్నకు స్పందిస్తూ, పని చేయడం తనకు ఇష్టమని పేర్కొన్నారు.
ఇంతలో, ఒక మీడియా ప్రతినిధి ''జేడీ వాన్స్‌ను ముందుగా అధ్యక్ష పదవిలో నియమించి, ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవి ద్వారా మీకు మార్గం సుగమం చేయడం సాధ్యమేనా?'' అని ప్రశ్నించగా, ట్రంప్ దాన్ని ఒక అవకాశంగా అభివర్ణించారు.
అంతేకాకుండా, మరికొన్ని ఇతర మార్గాలూ ఉన్నాయని తెలిపారు. అయితే, ''అవి ఏమిటి?'' అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు.
వివరాలు
ఇది ఎంతవరకు సాధ్యం?
అమెరికా రాజ్యాంగం ప్రకారం, ఒక వ్యక్తి రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవిని అలంకరించగలడు.
ఈ నిబంధనను మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. కానీ, అది సులభం కాదు.
రాజ్యాంగ సవరణ జరిగేందుకు, కాంగ్రెస్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి.
లేకపోతే, మూడింట రెండొంతుల రాష్ట్రాలు ఆమోదించాలి. లేదంటే నాలుగింట మూడొంతుల రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం.
2028లోనూ ట్రంప్ మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తారని ఆయన మద్దతుదారుడైన స్టీవ్ బానన్ పేర్కొన్నారు. ''దీనికి మా దగ్గర రెండు ప్రధాన ప్రత్యామ్నాయాలున్నాయి'' అని ఆయన వివరించారు.