
Donald Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందం చాలా తక్కువ సుంకంతో డీల్: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో మరో కీలక మలుపు తిరిగింది. ఇరు దేశాల మధ్య త్వరలోనే ఒక ప్రత్యేక వాణిజ్య ఒప్పందం జరగనుందన్న ఆశాభావాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య చర్చల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వివరాలు
కీలక దశకు చేరుకున్న వాణిజ్య చర్చలు
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ,"భారత్‌తో మేము ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని నేను భావిస్తున్నాను. ఇది భిన్నమైన ఒప్పందంగా ఉంటుంది. మేం భారత మార్కెట్లోకి వెళ్లి పోటీ పడటానికి వీలు కల్పించే డీల్ అది. ప్రస్తుతానికి భారత్ ఎవరినీ అనుమతించడం లేదు. కానీ, వారు అనుమతిస్తారని నేను నమ్ముతున్నాను. అలా చేస్తే, చాలా తక్కువ సుంకంతో మేము ఒప్పందం చేసుకుంటాం" అని స్పష్టం చేశారు. ఇప్పటికే వాషింగ్టన్‌లో సాగుతున్న వాణిజ్య చర్చలు కీలక దశను చేరుకున్నాయి. జూలై 9 గడువు సమీపిస్తున్న వేళ, వ్యవసాయ రంగానికి సంబంధించి భారత ప్రభుత్వం తన వైఖరిని మరింత గట్టిగా తీసుకెళ్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
సుంకాలను శాశ్వతంగా రద్దు చేయాలనే దిశగా ప్రయత్నాలు
చీఫ్ నెగోషియేటర్ రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలోని భారత బృందం చర్చల కోసం తమ పర్యటనను పొడిగించుకుంది. మొదట గత వారం గురువారం, శుక్రవారం జరుగాల్సిన చర్చలు, ఇరు దేశాలు ఒప్పందాన్ని ఖరారు చేయాలనే ఉద్దేశంతో పొడిగించడం జరిగింది. ట్రంప్ పదవిలో ఉన్నప్పుడు అమలులోకి వచ్చిన పరస్పర 26 శాతం సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు ఈ చర్చల ద్వారా ఆ సుంకాలను శాశ్వతంగా రద్దు చేయాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే జూలై 9వ తేదీలోపు ఒప్పందం కుదరకపోతే, వాటంతటవే అవి మళ్లీ అమలులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
వివరాలు
భారత్ విధించిన సుంకాలను తగ్గించాలని కోరిన అమెరికా
భారతదేశంలో వ్యవసాయ రంగం అత్యంత రాజకీయంగా సున్నితమైనది కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా అధికంగా ఉన్న చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధిపై ప్రభావం పడకుండా వ్యవహరించాల్సిన అవసరం కేంద్రానికి ఉంది. ముఖ్యంగా పాల రంగంలో ఇప్పటివరకు భారత్ ఎటువంటి విదేశీ పోటీకి తలుపులు తీయలేదు. అమెరికా దీనిపై ఒత్తిడి తెస్తున్నా భారత్ వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదని సమాచారం. అమెరికా ప్రభుత్వం తమ యాపిల్‌లు, నట్స్, జన్యుపరంగా మార్చిన పంటలపై భారత్ విధించిన సుంకాలను తగ్గించాలని కోరుతోంది.
వివరాలు
2030 నాటికి 500 బిలియన్ డాలర్లకుద్వైపాక్షిక వాణిజ్యం
దానికి ప్రత్యామ్నాయంగా భారత్ తన వస్త్ర ఉత్పత్తులు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి వంటి వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో మరింత ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ తాత్కాలిక ఒప్పందంతో పాటు, 2024 చివరి నాటికి పూర్తి స్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Agreement - BTA) తొలి దశను పూర్తి చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం ఉన్న 191 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చడమే వీరి అంతిమ దిశగా ఉంది.