Page Loader
ISKCON Temple: అమెరికాలో ఇస్కాన్‌ ఆలయంపై కాల్పుల దాడి.. తక్షణ చర్యలు తీసుకోవాలన్న భారత్
అమెరికాలో ఇస్కాన్‌ ఆలయంపై కాల్పుల దాడి.. తక్షణ చర్యలు తీసుకోవాలన్న భారత్

ISKCON Temple: అమెరికాలో ఇస్కాన్‌ ఆలయంపై కాల్పుల దాడి.. తక్షణ చర్యలు తీసుకోవాలన్న భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఉన్న శ్రీశ్రీ రాధా కృష్ణ ఇస్కాన్‌ దేవాలయంపై జరుగుతున్న దాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు వారు ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌) లో ఓ పోస్ట్‌ చేశారు. "ఉతాహ్‌లోని స్పానిష్‌ ఫోర్క్‌లో వెలసిన ఇస్కాన్‌ శ్రీశ్రీ రాధా కృష్ణ దేవాలయంపై ఇటీవల జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. భక్తులకు, ఆలయ నిర్వాహకులకు మా సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. స్థానిక అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి," అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

వివరాలు 

ఆలయ తోరణాలు, గోడల్లోకి సుమారు 20 నుంచి 30 బుల్లెట్లు 

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హోలీ ఉత్సవాలకు పేరొందిన ఈ ఇస్కాన్‌ ఆలయంపై ఇటీవల విద్వేషపూరితంగా కొందరు అనుచిత చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆలయంలో భక్తులు, అతిథులు ఉన్న సమయంలోనే రాత్రిపూట కాల్పులు జరిపారు. దీంతో ఆలయానికి తీవ్రంగా నష్టం జరిగింది. ఆలయ తోరణాలు, గోడల్లోకి సుమారు 20 నుంచి 30 బుల్లెట్ల దూసుకెళ్లాయి. ఇదే ఆలయం గతంలోనూ దాడులకు గురైన విషయం ఆలయ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ దాడులు విద్వేష భావాలతోనే జరిగినట్లు తమ అనుమానమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆలయ అధ్యక్షుడు వాయ్‌ వార్డెన్‌ వివరాలను వెల్లడించారు. గత నెలలో మూడు వేర్వేరు సందర్భాల్లో ఆలయంపై కాల్పులు జరిగాయని తెలిపారు.

వివరాలు 

 కాలిఫోర్నియాలో హిందూ దేవాలయంపై దాడి 

బుల్లెట్లు స్వాగత తోరణాలు, గోడలు, కిటికీలను తాకాయని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి సంఘటనలు జరగలేదని, అయితే ఇటీవలి కాలంలో అకస్మాత్తుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండటంతో భద్రతాపరంగా అధికారులు గమనించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఇస్కాన్‌ ఆలయం 1990ల ప్రారంభంలో నిర్మించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కావని ఇటీవల మరో ఉదాహరణను ఆలయ అధికారులు గుర్తు చేశారు. 2025 మార్చి 9న కాలిఫోర్నియాలోనూ హిందూ దేవాలయంపై దాడి జరిగిందని వెల్లడించారు. లాస్‌ ఏంజెలెస్‌లో ఖలిస్థానీ వర్గాలు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ముందు చినోహిల్స్‌లో ఉన్న బాప్స్‌ (బోచసన్వాసి అక్షర పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ) ఆలయంపై దాడి జరిగిందని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్కాన్ చేసిన ట్వీట్