
US-Saudi Arabia: అమెరికా-సౌదీ మధ్య 142 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఆయుధ ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ మధ్యప్రాచ్య పర్యటనలో భాగంగా మంగళవారం సౌదీ అరేబియాలో పర్యటించారు.
ఈ పర్యటన సందర్భంగా ట్రంప్,సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు అనేక ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఇందులో ముఖ్యంగా సౌదీ అరేబియాకు సుమారు 142 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను సరఫరా చేయడం కోసం ఒక ముఖ్య ఒప్పందం కుదిరింది.
ఇది భారత రూపాయల్లో సుమారు 12 లక్షల కోట్లకు పైగా అవుతుంది.అలాగే, అమెరికాలోని కృత్రిమ మేధస్సు (AI), ఇంధన మౌలిక వసతుల రంగాల్లో సౌదీకి చెందిన డేటా ఓల్ట్ అనే కంపెనీ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
వివరాలు
ట్రంప్ ను స్వయంగా ఆహ్వానించిన యువరాజు సల్మాన్
ఈ ఆయుధ ఒప్పందం ప్రాధాన్యం దక్కించుకోవడానికి కారణం.. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో గాజా యుద్ధం, ఇరాన్ అణ్వస్త్రాలు వంటి అంశాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో, అమెరికా-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచే చర్యగా దీనిని చూడవచ్చు.
ట్రంప్ సౌదీకి చేరుకున్న సమయంలో రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వయంగా యువరాజు సల్మాన్ వచ్చి అతన్ని స్వాగతించారు.
అనంతరం జరిగిన సమావేశాల్లో, ఇరువురు నాయకుల మధ్య చర్చల తర్వాత, రాయల్ కోర్ట్ అయిన ఆల్ యమమాహ్ ప్యాలెస్‌లో ట్రంప్ బృందానికి అత్యంత ఘనంగా విందు ఏర్పాటు చేశారు.
ట్రంప్ తన పర్యటనలో సౌదీతో పాటు ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలకూ వెళ్లనున్నారు.
వివరాలు
"ఫ్రీగా విమానం ఇస్తే తిరస్కరిస్తానా?": ట్రంప్
తనకు ఖతార్ రాజకుటుంబం బహుమతిగా ఇచ్చిన విలాసవంతమైన 747-8 జంబోజెట్ విమానం విషయమై స్పందిస్తూ ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు.
"అత్యంత ఖరీదైన, అత్యుత్తమ హంగులతో కూడిన విమానం ఉచితంగా ఇస్తే, దాన్ని తిరస్కరించాలంటే నేనేమైనా మూర్ఖుడ్ని?" అని అన్నారు.
ఈ విమానాన్ని ట్రంప్ స్వీకరించడంతో పాటు, దానిలో మరిన్ని ఆధునిక హంగులు జోడించి, తన పదవీకాలం 2029 వరకు ఎయిర్‌ఫోర్స్ వన్‌కి బదులుగా వాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే డెమోక్రాటిక్ పార్టీ నేతలు ఈ విషయంపై తీవ్ర విమర్శలు చేయడంతో ట్రంప్ పై విధంగా స్పందించారు.