LOADING...
Donald Trump: సుంకాలను ఆపితే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతాం:సుప్రీం తీర్పునకు ముందు ట్రంప్
సుప్రీం తీర్పునకు ముందు ట్రంప్

Donald Trump: సుంకాలను ఆపితే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతాం:సుప్రీం తీర్పునకు ముందు ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమలు చేసిన టారిఫ్‌ విధానాలపై అక్కడి సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ స్పందిస్తూ, తాను విధించిన సుంకాలను న్యాయస్థానం నిలిపివేస్తే ప్రత్యామ్నాయ మార్గాలను తప్పకుండా అన్వేషిస్తామని స్పష్టం చేశారు.

వివరాలు 

ఈ టారిఫ్‌లను విదేశీ దేశాలే చెల్లిస్తున్నాయి: ట్రంప్ 

''చైనా ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతోనే కొందరు ఈ టారిఫ్‌లపై కోర్టుల్లో కేసులు వేశారు. ఒకవేళ న్యాయస్థానం మా సుంకాలను వ్యతిరేకిస్తే, ప్రభుత్వం ఇతర అవకాశాలను వెతుక్కుంటుంది. నేను అమలు చేసిన టారిఫ్‌ల వల్ల తక్కువ కాలంలోనే ఫెడరల్‌ బడ్జెట్‌ లోటు సుమారు 27 శాతం వరకు తగ్గింది. ఈ సుంకాల కారణంగా అమెరికాలో వినియోగదారుల ఖర్చులు పెరిగాయని విమర్శలు వస్తున్నాయి. అయితే అది నిజం కాదు. ఈ టారిఫ్‌లను విదేశీ దేశాలే చెల్లిస్తున్నాయి. అమెరికా వినియోగదారులపై ఎలాంటి భారం పడటం లేదు. ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైనదే'' అని ట్రంప్‌ తెలిపారు.

వివరాలు 

టారిఫ్‌లను తిరిగి చెల్లించడం అసాధ్యం: ట్రంప్ 

ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొన్నినెలలకే అనేక దేశాలపై సుంకాలు విధించడం ప్రారంభించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా న్యాయస్థానాల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు పరిధిలోకి చేరింది. దీనిపై బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం)తీర్పు వెలువడనుంది. టారిఫ్‌ల అమలులో ట్రంప్‌ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా? అనే అంశంపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ట్రంప్‌ వరుసగా సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు తాను విధించిన సుంకాలను రద్దు చేస్తే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని,ఇప్పటివరకు వసూలు చేసిన టారిఫ్‌లను తిరిగి చెల్లించడం అసాధ్యమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Advertisement