LOADING...
Donald Trump: థర్డ్‌ వరల్డ్‌ దేశాల నుంచి శాశ్వతంగా వలసల నిలిపివేత.. బాంబు పేల్చిన ట్రంప్
థర్డ్‌ వరల్డ్‌ దేశాల నుంచి శాశ్వతంగా వలసల నిలిపివేత.. బాంబు పేల్చిన ట్రంప్

Donald Trump: థర్డ్‌ వరల్డ్‌ దేశాల నుంచి శాశ్వతంగా వలసల నిలిపివేత.. బాంబు పేల్చిన ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో జరిగిన కాల్పుల ఘటన తరువాత, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం ప్రకటించారు. పేద దేశాల నుండి అమెరికాకు వచ్చే వలసలను శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన చర్యలు అమెరికా ప్రభుత్వ వ్యవస్థ ఇప్పటికే ప్రారంభించిందని చెప్పారు. అదనంగా, వలసదారులకు అందుతున్న ప్రభుత్వ సబ్సిడీలు, ఫెడరల్‌ ప్రయోజనాలు కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు.

వివరాలు 

అక్రమ ప్రవేశాలను రద్దు చేస్తాం: ట్రంప్ 

''అమెరికా సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధిస్తున్నా, ప్రస్తుతం అమల్లో ఉన్న వలస విధానం మన పురోగతికి అడ్డంకిగా మారుతోంది. అనేక మంది జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. అందుకే, అమెరికా వ్యవస్థ మళ్లీ బలపడేందుకు, థర్డ్‌ వరల్డ్‌ దేశాల నుంచి వలసలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించాను. జో బైడెన్‌ ఆటోపెన్‌ సంతకాలతో చేర్చుకున్న లక్షలాది అక్రమ ప్రవేశాలను రద్దు చేస్తాం. దేశానికి మేలు చేయని, దేశాన్ని ప్రేమించని వారిని అమెరికా నుంచి పంపించివేస్తాం. విదేశీయులకు ఫెడరల్‌ బెనిఫిట్స్‌, సబ్సిడీలను నిలిపివేస్తాం. అమెరికా భద్రతకు ముప్పుగా మారే వారిని దేశం నుండి బహిష్కరిస్తాం. ఈ లక్ష్యాలను సాధించేందుకు తిరోగమన వలస విధానం అవసరం'' అని ట్రంప్‌ (Trump) తన ట్రూత్‌ సోషల్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

వివరాలు 

ఇటీవలి కాల్పుల ఘటన వివరాలు: 

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం, శ్వేతసౌధానికి రెండు బ్లాకుల దూరంలో కాల్పులు జరిగాయి. ఈ దాడిలో నేషనల్‌ గార్డ్‌కు చెందిన ఒక మహిళ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. నిందితుడిని అఫ్గానిస్తాన్‌కు చెందిన రెహ్మనుల్లా లకన్‌వాల్‌గా గుర్తించారు. అతడు గతంలో సీఐఏ మద్దతు పొందిన అఫ్గాన్‌ ప్రత్యేక దళాలలో పనిచేసి, ఆ తర్వాత అమెరికాకు వలస వచ్చినట్లు సమాచారం. ఈ సంఘటన తరువాతే ట్రంప్‌ తాజా వలస నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా, అఫ్గానిస్తాన్‌తో పాటు మరికొన్ని 18 దేశాల గ్రీన్‌కార్డ్‌ హోల్డర్ల వివరాలను పునఃసమీక్షించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Advertisement

వివరాలు 

థర్డ్‌ వరల్డ్‌ దేశాల జాబితా నేపథ్యం: 

ఒకప్పుడు పేద, అభివృద్ధిలో వెనుకబడిన దేశాలను 'థర్డ్‌ వరల్డ్‌ కంట్రీస్‌' అని వ్యవహరించేవారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని అనేక దేశాలు ఈ వర్గంలో ఉండేవి. ప్రస్తుతం వీటిని తక్కువ ఆదాయ దేశాలు అని పిలుస్తున్నారు. ఈ జాబితాలో దక్షిణ సూడాన్‌, సోమాలియా, నైగర్‌, బుర్కినా ఫాసో, బురుండి, అఫ్గానిస్తాన్‌, మడగాస్కర్‌, ఇథియోపియా, లైబీరియా, పాకిస్థాన్‌, సిరియా, ఉగాండా తదితర దేశాలు ఉన్నాయి.

Advertisement