Page Loader
Donald Trump:'భయం లేదు'..హార్వర్డ్‌పై పోరాటంలో విజయం సాధిస్తా: ట్రంప్‌ 
'భయం లేదు'..హార్వర్డ్‌పై పోరాటంలో విజయం సాధిస్తా: ట్రంప్‌

Donald Trump:'భయం లేదు'..హార్వర్డ్‌పై పోరాటంలో విజయం సాధిస్తా: ట్రంప్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. హార్వర్డ్‌కు రావాల్సిన 3 బిలియన్ డాలర్ల నిధులు ఇవ్వకుండా ఉండే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు.

వివరాలు 

హార్వర్డ్‌పై మా ప్రభుత్వం విజయం సాధిస్తుందని నమ్మకం

"హార్వర్డ్‌కు ఆ 3 బిలియన్ డాలర్ల నిధులను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నాను. ఆ మొత్తాన్ని దేశంలోని ట్రేడ్ స్కూల్స్(వృత్తి విద్యా సంస్థలు)కు మళ్లించాలనుకుంటున్నాను. ఇది అమెరికా కోసం గొప్ప పెట్టుబడి అవుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ ఇప్పటికీ విదేశీ విద్యార్థుల జాబితాను అందించలేదు.ఆ వివరాల కోసం ఎదురుచూస్తున్నాను. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే బిలియన్ డాలర్ల నిధులు ఖర్చు చేశాం. అయినా దేశంలోకి ఉన్మాదులు, అమెరికాకు హాని కలిగించదలచిన వారు ప్రవేశిస్తున్నారా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి ఈ జాబితా కీలకం అవుతుంది. ఒకవేళ అటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే, వారిని ముందుగానే గుర్తించి దేశంలోకి మళ్లీ రాకుండా అడ్డుకోవచ్చు. హార్వర్డ్‌పై మా ప్రభుత్వం విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాను" అని ట్రంప్‌ పేర్కొన్నారు.

వివరాలు 

విదేశీ విద్యార్థులు యూనివర్సిటీలో చేర్చుకునే అనుమతిని రద్దు

ఇటీవలి కాలంలో ట్రంప్ హార్వర్డ్‌కు ఇచ్చే నిధుల్లో కోత విధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా,విదేశీ విద్యార్థులను యూనివర్సిటీలో చేర్చుకునే అనుమతిని కూడా రద్దు చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హార్వర్డ్ యూనివర్సిటీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ట్రంప్ తీసుకున్న చర్య నైతికతకు విరుద్ధమని,ఇది సామర్థ్యాల మీద ప్రభావం చూపే నిర్ణయం అని హార్వర్డ్ ఆరోపించింది. ''ఒక్క సంతకంతో యూనివర్సిటీలోని మొత్తం విద్యార్థుల్లో పావువంతు మందిని తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది''అని హార్వర్డ్ వెల్లడించింది.

వివరాలు 

 విదేశీ విద్యార్థుల వివరాలు కావాలన్న ట్రంప్ 

ఈ విషయంపై విచారణ చేసిన ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి, ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో,ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనలో విదేశీ విద్యార్థుల వివరాలు కావాలని ఆయన మనసులో ఉన్నదాన్ని వెల్లడించారు. విదేశీ దేశాలు తమ విద్యార్థుల విద్య కోసం ఏమాత్రం నిధులు చెల్లించడం లేదని ఆయన విమర్శించారు.