LOADING...
Donald Trump: నిరసనకారులపై హింసకు దిగితే తీవ్ర పరిణామాలు: ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్
ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

Donald Trump: నిరసనకారులపై హింసకు దిగితే తీవ్ర పరిణామాలు: ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు రోజురోజుకూ ఉద్ధృతంగా మారుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళనలను అణిచివేయాలనే ఉద్దేశంతో నిరసనకారులపై హింసకు పాల్పడితే, దానికి తీవ్రమైన పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ఎప్పుడైనా ప్రజా ఉద్యమాలు మొదలైతే వాటిని బలవంతంగా అణిచివేయాలని అక్కడి పాలకులు ప్రయత్నించడం పరిపాటేనని ట్రంప్ పేర్కొన్నారు. ఈసారి కూడా అదే దారిలో వెళ్లితే అమెరికా జోక్యం చేసుకుని ఇరాన్‌కు గట్టి దెబ్బ తగులుతుందని హెచ్చరించారు.

వివరాలు 

నిరసనల్లో పాల్గొంటున్న ప్రజలు ధైర్యవంతులు

ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనల కారణంగా ఇప్పటివరకు సుమారు 45 మంది మరణించినట్లు మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. ఈ అంశాన్ని ప్రస్తావించిన ట్రంప్, ఈ మరణాలు నిరసనల సమయంలో జరిగిన తొక్కిసలాటలో చోటుచేసుకున్నవేనని, అందుకు ప్రత్యేకంగా ఎవరినీ బాధ్యులుగా నిలబెట్టలేమని వ్యాఖ్యానించారు. అలాగే నిరసనల్లో పాల్గొంటున్న ప్రజలను ధైర్యవంతులుగా అభివర్ణించారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే ఈ ఆందోళనలకు కారణమని తెలుస్తోంది.

వివరాలు 

ఇంటర్నెట్‌,టెలిఫోన్‌ సేవలను నిలిపివేస్తూ ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈ నిరసనలు క్రమంగా దేశమంతటా విస్తరించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఉద్యమాలు చేపడుతున్నారు. ప్రవాసంలో ఉన్న యువరాజు రెజా పహ్లావి నిరసనలకు పిలుపునివ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సేవలను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

Advertisement