LOADING...
H-1B visa: మాగా మద్దతుదారులపై ట్రంప్‌ అసహనం.. విదేశీ ఉద్యోగులు తప్పనిసరి
మాగా మద్దతుదారులపై ట్రంప్‌ అసహనం.. విదేశీ ఉద్యోగులు తప్పనిసరి

H-1B visa: మాగా మద్దతుదారులపై ట్రంప్‌ అసహనం.. విదేశీ ఉద్యోగులు తప్పనిసరి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తాజాగా హెచ్-1బీ వీసాతో పనిచేసే విదేశీ ఉద్యోగుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు బయట నుంచి నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరమని స్పష్టంగా అంగీకరించిన ఆయన,ఈ నిజాన్ని 'మాగా' మద్దతుదారులు అర్థం చేసుకోకపోవడం తనను అసహనానికి గురిచేస్తోందని తెలిపారు. అమెరికా-సౌదీ పెట్టుబడి సమ్మిట్‌ వేదికగా మాట్లాడిన ఆయన, దేశంలో భారీ స్థాయిలో ప్లాంట్ల నిర్మాణం జరుగనుందని చెప్పి, అవి అమెరికా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపేలా సహాయపడతాయని వివరించారు. ఈ కొత్త ప్లాంట్లలో పనిచేయడానికి విదేశీ నైపుణ్యాలు ఉన్న సిబ్బంది అవసరమవుతారని, వారిచే అమెరికన్లు కూడా ఆ టెక్నికల్‌ స్కిల్స్ నేర్చుకునే అవకాశం ఉంటుందని ట్రంప్‌ అన్నారు.

వివరాలు 

అరిజోనాలో బిలియన్‌ డాలర్లతో భారీ కంప్యూటర్‌ చిప్‌ ఫ్యాక్టరీ 

దేశీయ కంపెనీలు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టినా, ప్రత్యేక నైపుణ్యాలున్న సిబ్బంది లేనిపక్షంలో విజయాన్ని సాధించడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. విదేశీ నిపుణులు అమెరికాలో పనిచేసి, తమ జ్ఞానాన్ని స్థానికులకు పంచి, తరువాత తమ దేశాలకు తిరిగి వెళ్లవచ్చని కూడా పేర్కొన్నారు. అరిజోనాలో బిలియన్‌ డాలర్లతో భారీ కంప్యూటర్‌ చిప్‌ ఫ్యాక్టరీ ఏర్పడుతుందని, దాన్ని నడిపేందుకు స్థానిక నిరుద్యోగులను నియమించాలన్న ఉద్దేశ్యం ఉన్నప్పటికీ, ఆ పనులను సవ్యంగా చేయించేందుకు బయట నుంచి అనేక మంది నైపుణ్యవంతులు రావాల్సిందేనని ట్రంప్‌ తెలిపారు. వేల సంఖ్యలో విదేశీ ప్రొఫెషనల్స్‌ను తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చినా, వారిని తాను స్వాగతిస్తానని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

వలసలపై అనేక కఠిన నిర్ణయాలు

అమెరికాకు అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులు అవసరం అనేది మాగా వర్గాలకి అర్థం కావడం లేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశీ నిపుణులను అనుమతించకుండా ఉంటే, తమ ప్రాజెక్టులు విజయవంతం కావడం కష్టమని ఆయన ఒప్పుకున్నారు. అయితే, ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలపై అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచే నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వివరాలు 

ఈ విధానాలను వ్యతిరేకిస్తున్న మాగా మద్దతుదారులు

కొంతకాలంగా విదేశీ నిపుణుల కారణంగా అమెరికన్లకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ట్రంప్‌ చెప్పుకుంటూ వచ్చినా, ఇటీవలి కాలంలో ఆయన తన భాషని మార్చుకున్నారు. హెచ్-1బీ వీసా వ్యవస్థను సమర్థిస్తూ, ప్రపంచ ప్రతిభను అమెరికాకు తీసుకురావడంలో ఇది కీలకమని అన్నారు. విదేశీ ఉద్యోగులు వచ్చి అమెరికన్లకు నైపుణ్యాలు నేర్పించి వెళ్లాలన్నది తన అభిప్రాయం అని వెల్లడించారు. అయితే, ఈ విధానాలకు మాగా మద్దతుదారులు ఇంకా వ్యతిరేకిస్తూనే ఉన్నారు.