టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు
సోమవారం భారీ భూకంపం కారణంగా సిరియా, టర్కీలో 21,000 మందికి పైగా మరణించారు. విరామం లేకుండా 24 గంటలూ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి కానీ మంచు, వర్షం కారణంగా వారి పనికి ఆటంకం కలుగుతుంది. టర్కీ-సిరియా భూకంపంలో మృతుల సంఖ్య 21,000 దాటింది. టర్కీలో 17,674, సిరియాలో 3,377 మంది మరణించారని, మొత్తం మరణాల సంఖ్య 21,051 కు చేరుకుందని అధికారులు తెలిపారు. గజియాంటెప్‌లోని భూకంప కేంద్రం సమీపంలో భారీ విధ్వంసం సంభవించింది. ఇక్కడ రెండు సెకన్లలోపే బహుళ అంతస్తుల భవనాలు శిధిలాలుగా మారాయి. ఏడు నగరాల్లో ప్రభుత్వ ఆసుపత్రులతో సహా దాదాపు 3,000 భవనాలు కూలిపోయాయని ప్రభుత్వం తెలిపింది. చలి, ఆకలి, నిరాశతో వేల మంది నిరాశ్రయులు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు.
శిథిలాలలో ఇంకా సజీవంగా కనిపిస్తారనే ఆశలు మాత్రం సన్నగిల్లుతున్నాయి
హటేలో కూలిపోయిన భవనం శిథిలాలలో చిక్కుకున్న 2 ఏళ్ల బాలుడిని 79 గంటల తర్వాత రక్షించారు. శిథిలాలలో ఇంకా సజీవంగా కనిపిస్తారనే ఆశలు మాత్రం సన్నగిల్లాయి. టర్కీ, సిరియాలకు సహాయం చేసేందుకు భారత్ 'ఆపరేషన్ దోస్త్'ను ప్రారంభించి రెస్క్యూ టీమ్‌లు, వైద్య బృందాలు, ఇతర సామాగ్రిని పంపింది. భారత సైన్యం హటేలో ఒక ఫీల్డ్ హాస్పిటల్‌ను కూడా ఏర్పాటు చేసింది, ఇందులో శస్త్రచికిత్స, అత్యవసర వార్డులు ఉంటాయి. అమెరికా $ 85 మిలియన్ల ప్రారంభ ప్యాకేజీని ప్రకటించింది. ఆహారం, ఆశ్రయం, అత్యవసర ఆరోగ్య సేవలతో సహా లక్షల మంది ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడానికి భాగస్వాములకు నిధులు వెళ్తాయని తెలిపింది.