UK: బ్రిటన్ యువరాజు విలియం నివాసంలో చోరీ కలకలం.. ఇద్దరి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ నివాసంలోకి దొంగలు చొరబడిన ఘటన కలకలం రేపింది. తూర్పు ఇంగ్లాండ్‌లోని నార్ఫోక్ ప్రాంతంలో ఉన్న సండ్రింగ్హామ్ ఎస్టేట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎస్టేట్‌లోని పది పడక గదుల అన్మర్ హాల్ భవనాన్ని విలియం, కేట్ దంపతులు తమ నివాసంతో పాటు విడిది కేంద్రంగా ఉపయోగిస్తుంటారు. సోమవారం రాత్రి కొందరు అనుమానాస్పద వ్యక్తులు భవనంలోకి ప్రవేశించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. డ్రోన్లు, హెలికాప్టర్లు, జాగిలాల సహాయంతో అన్మర్ హాల్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాలు
దొంగలు భవనంలోకి ప్రవేశించిన సమయంలో..
అయితే దొంగలు భవనంలోకి ప్రవేశించిన సమయంలో రాజకుటుంబానికి చెందిన వారెవరూ అక్కడ లేరు.
ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్తో పాటు వారి కుటుంబ సభ్యులు బెర్క్‌షైర్‌లోని రాయల్ విండ్సర్ క్యాజిల్ ఎస్టేట్ పరిధిలో ఉన్న ఫారెస్ట్ లాడ్జిలో ఉన్నట్లు సమాచారం.
దీంతో ఘటన జరిగిన సమయంలో రాజ దంపతులు అన్మర్ హాల్లో లేరని తెలుస్తోంది.