German: క్రిస్మస్ మార్కెట్‌లో కారు దూసుకెళ్లి ఇద్దరు మృతి.. 60 మందికి గాయాలు
జర్మనీలో మాగ్డేబర్గ్ నగరంలోని క్రిస్మస్ మార్కెట్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ప్రజలపై ఓ కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో పాటు ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. మాగ్డేబర్గ్ క్రిస్మస్ మార్కెట్‌లో ఘటన జరగగా, ఆ కారు దాదాపు 400 మీటర్ల దూరం వరకు అదుపు తప్పి ప్రయాణించింది. ఈ ప్రమాదానికి సంబంధించి 50 ఏళ్ల సౌదీ అరేబియా వ్యక్తి తలేబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బీఎమ్‌డబ్ల్యూ కారును అద్దెకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తీవ్రంగా ఖండించిన సఃదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ
మరోవైపు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ ఘటనను ఖండించింది. జర్మనీలో జరిగిన ఈ హింసాత్మక ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనతో 2016లో బెర్లిన్లో జరిగిన క్రిస్మస్ మార్కెట్ దుర్ఘటన మళ్లీ జ్ఞాపకం వచ్చింది. ఆ సమయంలో ఓ ట్రక్కు మార్కెట్‌లోకి దూసుకెళ్లి 12 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. తాజా ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. మాగ్డేబర్గ్ ఘటనలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు.