Page Loader
US-Ukraine: ఉక్రెయిన్‌కు షాక్ ఇచ్చిన అమెరికా.. ఆయుధ సరఫరాకు బ్రేక్‌!
ఉక్రెయిన్‌కు షాక్ ఇచ్చిన అమెరికా.. ఆయుధ సరఫరాకు బ్రేక్‌!

US-Ukraine: ఉక్రెయిన్‌కు షాక్ ఇచ్చిన అమెరికా.. ఆయుధ సరఫరాకు బ్రేక్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాతో భీకర యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సహాయం అందజేస్తున్న అమెరికా, ఇప్పుడు అనూహ్యంగా షాకిచ్చింది. కీవ్‌కు కొన్ని రకాల ఆయుధాలను ఇకపై సరఫరా చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్లు పెంటగాన్‌ అధికారులు ప్రకటించారు. అమెరికా తమ సొంత ఆయుధ నిల్వలను సమీక్షించిన అనంతరం ఈ కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రష్యా దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్న సమయంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఉక్రెయిన్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఇంతకుముందు బైడెన్‌ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు కొన్ని ముఖ్యమైన ఆయుధాలను సరఫరా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల చేసిన నిల్వల పరిశీలనలో, కీవ్‌కు ఇవ్వవలసిన ఆయుధాల స్టాక్‌ అతి తక్కువగా ఉన్నట్లు గుర్తించి పెంటగాన్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

వివరాలు 

తమ అవసరాలను తీర్చుకున్న తర్వాతే ఇతర దేశాలకు సహాయం

అందువల్ల ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఆయుధ షిప్‌మెంట్లను ఆపివేయాలని తాము నిర్ణయించినట్లు వారు స్పష్టం చేశారు. కానీ ఏ ఏ రకాల ఆయుధాల పంపిణీ నిలిపివేయబోతున్నారన్న విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో, అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచనల ప్రాతిపదికన జరిగిందని వైట్‌హౌస్‌ ప్రతినిధి అన్నా కేలీ తెలిపారు. అమెరికా ముందుగా తమ అవసరాలను తీర్చుకున్న తర్వాతే ఇతర దేశాలకు సహాయం అందించాలన్న ట్రంప్‌ ఆదేశాల ప్రకారమే ఈ చర్యలు తీసుకున్నారని ఆమె స్పష్టం చేశారు. 2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికా సుమారు 66 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలు, సైనిక సహాయాన్ని ఉక్రెయిన్‌కు అందజేసిన విషయం తెలిసిందే.

వివరాలు 

తాజాగా మరింత ఉగ్రరూపం దాల్చిన యుద్ధం

కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇక మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం తాజాగా మరింత ఉగ్రరూపం దాల్చినట్లు కనిపిస్తోంది. మాస్కో దీర్ఘశ్రేణి డ్రోన్లతో కీవ్‌పై తీవ్రమైన దాడులు జరుపుతోంది. వాటిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ తీవ్రంగా కష్టపడుతోంది. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో, రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరగాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌ తీసుకున్న ప్రయత్నాలు విజయవంతం కాలేదు. ఫలితంగా, ఆ చర్చలు మధ్యలోనే నిలిచిపోయాయి.