Page Loader
Ukraine war briefing: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి నేటితో 1000 రోజులు.. నష్టం లెక్కలివీ..!
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి నేటితో 1000 రోజులు.. నష్టం లెక్కలివీ..!

Ukraine war briefing: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి నేటితో 1000 రోజులు.. నష్టం లెక్కలివీ..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2024
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరోప్ లో చోటుచేసుకున్న అత్యంత భీకరమైన సంఘటన ఉక్రెయిన్-రష్యా యుద్ధం (Russia-Ukraine War). 21వ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన ఈ యుద్ధం మంగళవారంతో 1000 రోజులకు చేరుకుంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై మాస్కో సేనలు ప్రారంభించిన సైనిక చర్య కీవ్ నగరాన్ని భారీ విధ్వంసానికి గురిచేసింది. ఈ ఘర్షణలో పరస్పర క్షిపణి దాడుల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షల మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌లో అనేక నగరాలు పూర్తిగా నాశనమయ్యాయి, చాలా గ్రామాలు పూర్తిగా గుర్తు లేకుండా పోయాయి. దాదాపు రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధం మిగిల్చిన భయానకతను ఒక్కసారి పరిశీలిస్తే, దాని తీవ్రత అర్థమవుతుంది.

వివరాలు 

 ప్రాణాలు కోల్పోయిన 80,000 మంది ఉక్రెయిన్‌ సైనికులు

వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్‌ బలగాల నుంచి దాదాపు 80,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు, అలాగే 4 లక్షల మంది గాయపడినట్లు సమాచారం. రష్యా వైపు నష్టాలపై స్పష్టమైన వివరాలు లేవు, కానీ పశ్చిమ నిఘా వర్గాల అంచనా ప్రకారం, ఇప్పటివరకు 2 లక్షల రష్యా సైనికులు మరణించగా, మరో 4 లక్షల మంది గాయపడినట్లు తెలుస్తోంది. పౌరులపై ప్రభావం ఉక్రెయిన్‌లోని ఐరాస మానవ హక్కుల మిషన్‌ గణాంకాల ప్రకారం, 2024 ఆగస్టు 31 నాటికి కనీసం 11,743 పౌరులు మరణించగా, 24,600 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఈ సంఖ్య అంచనాలకంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని ఉక్రెయిన్‌ అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

శరణార్థుల పరిస్థితి

ఎందుకంటే రష్యా ఆధీనంలోని ప్రాంతాల్లో యుద్ధ బాధితుల వివరాలు తెలియజేయడం సాధ్యం కాలేదు. 589 చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు నవంబర్‌ 14 నాటికి రికార్డు చేశారు. యుద్ధం కారణంగా జనన రేటు దారుణంగా పడిపోయింది. రెండున్నరేళ్ల క్రితం ఉన్న రేటుతో పోల్చితే ఇప్పుడు ఇది మూడో వంతుకు తగ్గిపోయింది. దాదాపు 40 లక్షల మంది దేశంలోనే మరో ప్రాంతాలకు తరలిపోగా, 60 లక్షల మంది పైగా ప్రాణభయంతో ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. ఆర్థిక నష్టం ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌ గత ఏడాది డిసెంబరు నాటికి 152 బిలియన్‌ డాలర్ల నష్టం చవిచూసింది. హౌసింగ్‌, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, విద్యుత్‌, వ్యవసాయ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

వివరాలు 

ఉక్రెయిన్‌కి పశ్చిమ దేశాల మద్దతు 

ఉక్రెయిన్‌ పునర్నిర్మాణం కోసం 486 బిలియన్‌ డాలర్లు అవసరమవుతుందని ప్రపంచ బ్యాంకు, ఐరోపా కమిషన్‌, ఐరాస అంచనా వేయగా, ఇది సాధారణ జీడీపీతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. రష్యా ఆక్రమణలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ పశ్చిమ దేశాల నుంచి భారీ ఆర్థిక, సైనిక సాయం అందుకుంది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు 100 బిలియన్‌ డాలర్లకు పైగా సాయం అందినట్లు తెలుస్తోంది. 2025 బడ్జెట్‌లో రక్షణ రంగానికి 53.3 బిలియన్‌ డాలర్లు వెచ్చించాలని ఉక్రెయిన్‌ ప్రణాళిక వేస్తోంది. ఈ సుదీర్ఘ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో సామాన్యుల జీవితాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రపంచం యుద్ధానికి పరిష్కారం కనుగొనాలని ఆకాంక్షిస్తోంది.