
Ukraine: ఉక్రెయిన్ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో కీలక మార్పులు..ప్రధాని పదవికి ష్మిహాల్ రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌లో రాజకీయ పరంగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ దిశగా ముందడుగు వేసింది. ఈ ప్రక్రియలో భాగంగా, ప్రస్తుత ప్రధాని డెనిస్ ష్మిహాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యం లో, రష్యాపై ఉక్రెయిన్ మరింత దాడికి సిద్ధమవుతోందని సమాచారం. అమెరికా మద్దతుతో సాగుతున్న ఈ ప్రణాళికల నేపథ్యంలో ప్రభుత్వ స్థాయిలో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దేశ రాజకీయ వ్యవస్థను, భద్రతా వ్యూహాలను మరింత సమర్థవంతంగా మలచేందుకు జెలెన్‌స్కీ ఈ నిర్ణయాలు తీసుకున్నారని విశ్లేషణ.
వివరాలు
యులియా స్వైరిడెంకో - కొత్త ప్రధానిగా ప్రతిపాదన
ప్రధానిగా నూతనంగా నియమించేందుకు జెలెన్‌స్కీ, ప్రస్తుత ఆర్థిక మంత్రి, ఉప ప్రధాని అయిన యులియా స్వైరిడెంకోను ప్రతిపాదించారు. యులియా జెలెన్‌స్కీకి అత్యంత సన్నిహితురాలుగా మాత్రమే కాకుండా, ఆయనకు సుదీర్ఘకాలం మిత్రురాలిగా కూడా పేరుగాంచారు. అమెరికాతో ఉక్రెయిన్ కుదుర్చుకున్న ఖనిజ వనరుల ఒప్పందాల్లో యులియా కీలకపాత్ర పోషించారు. అంతేకాకుండా పశ్చిమ దేశాల నేతలతో జరిగిన అనేక అంతర్జాతీయ సమావేశాల్లోనూ ఆమె చురుకుగా పాలుపంచుకున్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆమెను ప్రధానిగా ఎంపిక చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
ష్మిహాల్‌కు రక్షణ మంత్రిత్వ బాధ్యతలు?
2020 మార్చి నుంచి ఉక్రెయిన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ష్మిహాల్‌కు త్వరలో రక్షణ మంత్రిగా బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. దేశ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం ఈ మార్పును పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఓటింగ్ - ప్రణాళికలు సిద్ధం యులియాను ప్రధానిగా నియమించేందుకు ఉక్రెయిన్ పార్లమెంటులో ఈ వారంలో ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే రానున్న ఆరు నెలలలో అమలు చేయవలసిన ముఖ్య ప్రణాళికలపై జెలెన్‌స్కీ.. యులియా మధ్య చర్చలు కూడా జరిగాయని సమాచారం.