Trump: ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి దిశగా అడుగులు.. 28 పాయింట్ల ప్రణాళిక రూపొందించిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదరబోతోందన్న వార్తలు అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపిస్తున్నాయి. అమెరికా కూడా శాంతి పురోగతి త్వరలోనే కనబడవచ్చని చెప్పినా, ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొంటున్నారు. దీంతో శాంతి ఒప్పందంపై ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తాజాగా,ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల కోసం 28 అంశాల ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైంది. దీనిని అమలు చేయడంలో భాగంగా, అమెరికా ప్రతినిధి బృందం రెండు దేశాల మధ్య చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు రంగ ప్రవేశం చేసింది. చర్చలు పురోగతిలో ఉన్నట్టే సమాచారం వెలువడుతున్నా,కీలకమైన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు వెలువడలేదు.
వివరాలు
రెండు దేశాలు కూడా యుద్ధంతో విసిగిపోయాయి
28 పాయింట్ల ప్రణాళికపై రష్యా అనుకూలత చూపుతున్నప్పటికీ, ఉక్రెయిన్,యూరోపియన్ దేశాలు కొన్ని విషయాల్లో ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందించారు. "ఏం జరుగుతుందో త్వరలో తెలుస్తుంది. ఒక తేదీ నిర్ణయించారు, అది కూడా చాలా సమీపంలోనే ఉంది. నాకు ప్రత్యేక గడువు ఏదీ లేదు. రెండు దేశాలు కూడా యుద్ధంతో విసిగిపోయాయని అనిపిస్తోంది. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిపోయింది. ఇదే సమయంలో జెలెన్‌స్కీ అమెరికాకు రావాలనుకుంటున్నారు, కానీ ముందుగా ఒక ఒప్పందం కుదిరితే మంచిదని నేను అనుకుంటున్నా. చర్చలు బాగానే సాగుతున్నాయి, పురోగతి కనబడుతోంది. ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను పరిష్కరించాం. పుతిన్‌తో నా సంబంధాల వల్ల ఈ యుద్ధం ఆపడం సులభమని భావించా.
వివరాలు
మాస్కోకు స్టీవ్ విట్‌కాఫ్
కానీ కాస్త కఠినంగా మారింది. సమయం ఎక్కువైపోయింది. రెండు దేశాలు వెంటనే ఒప్పందం కుదుర్చుకోవాలి. ఆ తరువాతే ఇద్దరి నేతలను నేను కలుస్తా," అని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో, శాంతి ఒప్పందం కుదిరిన తర్వాతనే పుతిన్, జెలెన్‌స్కీతో భేటీ అవుతానని ట్రంప్ స్పష్టంగా తెలిపారు. పుతిన్‌తో చర్చలు జరిపేందుకు తన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌ను మాస్కోకు పంపాలని ఆదేశించారు. అలాగే అబుదాబిలో ఇప్పటికే రష్యా ప్రతినిధులతో చర్చలకు నాయకత్వం వహిస్తున్న ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కాల్‌కు, ఉక్రెయిన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యే బాధ్యతను అప్పగించారు.