
United Airlines: సాంకేతిక లోపంతో అమెరికాలో నిలిచిపోయిన విమానాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు సాంకేతిక లోపం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ సంఘటన వల్ల వేలాదిమంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. సాంకేతిక లోపమే ఈ అర్ధాంతర వ్యత్యయం కి కారణమని అధికారులు స్పష్టంచేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు మరిన్ని విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ముఖ్యంగా షికాగో, డెన్వర్, న్యూఆర్క్,హ్యూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన విమానాశ్రయాల్లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ విషయంపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి స్పందిస్తూ.."సాంకేతిక లోపాన్ని పరిష్కరించాము. సాధారణ సేవల పునరుద్ధరణ కోసం మా సాంకేతిక బృందం పూర్తి స్థాయిలో కృషి చేస్తోంది"అని ఒక వార్తా సంస్థకు తెలిపారు.
వివరాలు
826 విమానాలు ఆలస్యంగా.. 23 విమానాలు పూర్తిగా రద్దు
ఇది సైబర్ దాడి కాదని సంస్థ స్పష్టంగా ఖండించింది. అయితే, ఈ సాంకేతిక లోపానికి గల నిజమైన కారణాన్ని మాత్రం సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ఈ సమస్య కారణంగా మొత్తం 826 విమానాలు ఆలస్యంగా నడవగా, మరో 23 విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. వీటి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు తమ కోపాన్ని పలువురు ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తపరిచారు. ఇదే తరహాలో గత నెలలో అలస్కా ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంది. అప్పుడు కొన్ని గంటల పాటు ఆ సంస్థ విమానాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.