Loading...
Russia anti plague lab: రష్యా యాంటీ ప్లేగు ల్యాబ్‌లో కలకలం.. యువ పరిశోధకురాలి మృతి.. 197 మందికి క్వారంటైన్!
రష్యా యాంటీ ప్లేగు ల్యాబ్‌లో కలకలం.. యువ పరిశోధకురాలి మృతి.. 197 మందికి క్వారంటైన్!

Russia anti plague lab: రష్యా యాంటీ ప్లేగు ల్యాబ్‌లో కలకలం.. యువ పరిశోధకురాలి మృతి.. 197 మందికి క్వారంటైన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలో తీవ్ర కలకలం రేగింది. సైబీరియాలోని అత్యంత కీలకమైన ఓ ప్రయోగశాలలో పనిచేస్తున్న 28 ఏళ్ల యువ పరిశోధకురాలు గుర్తుతెలియని వ్యాధితో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో రష్యా అధికారులు అప్రమత్తమయ్యారు. మృతురాలితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 200 మందిని గుర్తించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఈ ఘటనపై క్రిమినల్ విచారణ ప్రారంభించడం పరిస్థితి తీవ్రతపై అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. సైబీరియాలోని ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో డారియా షిపిలోవా పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 29న ఆమె తీవ్రమైన న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరారు.

వివరాలు

నన

ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో అక్టోబర్ 1న ఆమె ప్రాణాలు కోల్పోయారు.

అయితే.. డారియా షిపిలోవా మృతికి కచ్చితమైన కారణం ఏమిటనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు.

ఆమె ప్రయోగశాలలో విధులు నిర్వహిస్తున్న సమయంలో జీవ నమూనాలు ఉన్న టెస్ట్ ట్యూబ్ ప్రమాదవశాత్తు పగిలిపోయిందని, దాని కారణంగానే ఆమెకు ఇన్ఫెక్షన్ సోకి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

వివరాలు

న్యుమోనియాతోనే మృతి: రష్యా ఆరోగ్య సంస్థ

ఈ ఘటనపై రష్యా ప్రజారోగ్య సంస్థ 'రోస్పోట్రెబ్నాడ్జోర్' స్పందించింది. గుర్తుతెలియని కారణాలతో వచ్చిన న్యుమోనియాతోనే పరిశోధకురాలు మరణించినట్లు అధికారికంగా ప్రకటించింది.

అయితే.. ఆమె ప్లేగు వ్యాధి బారిన పడి మరణించారనే వార్తలను సంస్థ ఖండించింది.

ఇర్కుట్స్క్ ప్రాంతంలో ప్రజారోగ్య పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందని రోస్పోట్రెబ్నాడ్జోర్ స్పష్టం చేసింది.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు

197 మందికి క్వారంటైన్

అయినప్పటికీ అధికారులు ముందుజాగ్రత్త చర్యలను మరింత ముమ్మరం చేశారు. మృతురాలితో కాంటాక్ట్‌లో ఉన్న దాదాపు 197 మందిని గుర్తించారు.

వారిని క్వారంటైన్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అంతేకాకుండా కొన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేశారు.

పరిస్థితిని సమీక్షించేందుకు రష్యా చీఫ్ శానిటరీ డాక్టర్ స్వయంగా ఇర్కుట్స్క్ ప్రాంతానికి చేరుకున్నారు.

అక్కడి పరిస్థితులను పరిశీలించి, అవసరమైన ముందుజాగ్రత్త చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ADVERTISEMENT

వివరాలు

భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగిందా?

మరోవైపు.. ప్రయోగశాలలో పనిచేసే సమయంలో భద్రతా నిబంధనలు ఉల్లంఘించారా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై క్రిమినల్ విచారణకు ఆదేశించారు. ముఖ్యంగా పని ప్రదేశంలో భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా? జీవ నమూనాలతో వ్యవహరించే సమయంలో ప్రమాదం జరిగిందా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతానికి ఎలాంటి వ్యాధి వ్యాప్తి చెందలేదని రష్యా అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అయినప్పటికీ.. గుర్తుతెలియని కారణాలతో పరిశోధకురాలు మృతి చెందడం, ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్న దాదాపు 197 మందిని క్వారంటైన్‌లో ఉంచడం, ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం, అలాగే క్రిమినల్ విచారణకు ఆదేశించడం స్థానికంగా ఆందోళనకు కారణమైంది.

ADVERTISEMENT