
US And Ukraine: ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసిన ఉక్రెయిన్-అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్,అమెరికా దేశాల మధ్యఎట్టకేలకు అరుదైన ఖనిజాల తవ్వకానికి సంబంధించిన ఓ కీలక ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందంపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్,ఉక్రెయిన్ తొలి ఉపప్రధాని యులియా సిర్దెంకోలు సంతకాలు చేశారు.
ఈ ఒప్పందంతో అమెరికా ప్రభుత్వం ఉక్రెయిన్ దేశంలో ఉండే అల్యూమినియం, గ్రాఫైట్, చమురు, సహజ వాయువు సహా ఇతర విలువైన ఖనిజాలను తవ్వుకునేందుకు అధికారిక అనుమతి పొందినట్లైంది.
ఈ ఒప్పందం ఫలితంగా, ఉక్రెయిన్‌లో అమెరికా సంయుక్త పెట్టుబడి నిధి ఏర్పాటు చేయబడనుంది.
ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో యూఎస్‌కి చెందిన పెట్టుబడిదారులకు ప్రాధాన్యత లభించనుంది.
వివరాలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మద్దతు
ఈ అంశంపై స్పందించిన అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో, ''ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి అవసరమైన ఉమ్మడి పెట్టుబడి నిధిని స్థాపించేందుకు ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్వేచ్ఛాయుత, సార్వభౌమాధికం కలిగిన, అభివృద్ధిశీలమైన ఉక్రెయిన్ కోసం ట్రంప్ తీసుకుంటున్న ఆర్థిక కట్టుబాటు ఈ చారిత్రక భాగస్వామ్యంలో ప్రతిబింబిస్తోంది'' అని పేర్కొంది.
ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మద్దతు తెలుపుతుందని,దీనికి ప్రతిఫలంగా ఉక్రెయిన్‌లో ఖనిజాల తవ్వకానికి అనుమతి ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే సూచించిన సంగతి తెలిసిందే.
వివరాలు
ఇరుపక్షాలు ఒప్పందంపై అంగీకారం
నిజానికి ఈ ఒప్పందంపై ఇరు దేశాలు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సంతకాలు చేయాల్సి ఉంది.
అయితే అప్పట్లో ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ట్రంప్,ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య మీడియా సమక్షంలో మాటల తూటాలు పేలడంతో ఒప్పందం అలాగే ఉండిపోయింది.
ఆ ఘటన తరువాత కొన్ని నెలల పాటు ఈ వ్యవహారం అలానే కొనసాగింది.
అయినప్పటికీ, ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇరుదేశాలు తెర వెనుక ప్రయత్నాలను కొనసాగించాయి.
ఆ ప్రయత్నాల ఫలితంగా చివరికి ఇరుపక్షాలు ఒప్పందంపై అంగీకారం తెలిపాయి.