USA: ట్రంప్ ఆదేశాల మేరకు ట్రాన్స్‌జెండర్లు మిలిటరీలో చేరకుండా అమెరికా ఆర్మీ నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన పరిపాలనలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
గతంలోనే మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్‌ల (Transgenders) పాల్గొనడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే.
తాజాగా, అమెరికా సైన్యంలో ట్రాన్స్‌జెండర్‌ల నియామకాన్ని కూడా నిలిపివేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు అమెరికా మిలిటరీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేసింది.
వివరాలు
అమెరికాకు సేవ చేయాలని ఆశించే జెండర్ డిస్ఫోరియా ఉన్నవారిని గౌరవిస్తున్నాం
"ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను సైన్యంలో చేరనివ్వం. అలాగే, సర్వీసులో ఉండగా లింగ మార్పు శస్త్రచికిత్సలు చేయించుకునేందుకు అనుమతి ఇవ్వం. ఈ కొత్త మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. అమెరికాకు సేవ చేయాలని ఆశించే జెండర్ డిస్ఫోరియా ఉన్నవారిని గౌరవిస్తున్నాం. అయితే, తమను తాము ట్రాన్స్‌జెండర్‌గా భావించే వారి నియామకాలను నిలిపివేస్తున్నాం. అలాగే, ఇప్పటికే సైన్యంలో పనిచేస్తున్న వారు లింగ మార్పు చికిత్స పొందేందుకు వీలులేకుండా చర్యలు తీసుకుంటున్నాం" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
వివరాలు
మిలిటరీ నియామకాల్లో కూడా ఇదే విధానం
ఇది మొదటిసారి కాదు. ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవిలో కూడా సైన్యంలో ట్రాన్స్‌జెండర్‌ల ప్రవేశాన్ని ఆపే ప్రయత్నం చేశారు.
అయితే, అప్పటికే సైన్యంలో పనిచేస్తున్నవారిని కొనసాగించారు. అలాగే, అధికారంలోకి రాకముందు నిర్వహించిన ఓ ర్యాలీలో మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్‌లు పాల్గొనకుండా చూస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ దిశగా ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. ఇప్పుడు, మిలిటరీ నియామకాల్లో కూడా ఇదే విధానం అమలు చేస్తున్నారు.
వివరాలు
మహిళల క్రీడల్లో పురుషులు లేకుండా చూస్తాం: ట్రంప్
ట్రాన్స్‌జెండర్ హక్కుల విషయంలో రిపబ్లికన్ పార్టీ నేతలు తరచుగా తీవ్ర అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.
కొన్ని నెలల క్రితం ఒలింపిక్స్ సందర్భంగా అల్జీరియా ప్లేయర్ ఇమానె ఖెలిఫ్ లింగ వివాదంలో ఇరుక్కొన్న సంగతి తెలిసిందే.
అప్పట్లో ట్రంప్ కూడా మహిళల క్రీడల్లో పురుషులు లేకుండా చూస్తానని ప్రకటించారు.
ఇటీవల, డెమోక్రటిక్ పార్టీకి చెందిన ట్రాన్స్‌జెండర్ నేత సారా మెక్‌బ్రైడ్ (Sarah McBride)ను మహిళల బాత్‌రూమ్‌లోకి అనుమతించరాదని రిపబ్లికన్‌లు ప్రత్యేక తీర్మానం తీసుకువచ్చారు.