LOADING...
US Shooting: అమెరికా స్కూల్ విద్యార్థులపై కాల్పుల ఘటన.. 'భారత్‌పై అణుదాడి చేయాలి' అంటూ తుపాకిపై దుండగుడి రాతలు
అమెరికా స్కూల్ విద్యార్థులపై కాల్పుల ఘటన.. 'భారత్‌పై అణుదాడి చేయాలి' అంటూ తుపాకిపై దుండగుడి రాతలు

US Shooting: అమెరికా స్కూల్ విద్యార్థులపై కాల్పుల ఘటన.. 'భారత్‌పై అణుదాడి చేయాలి' అంటూ తుపాకిపై దుండగుడి రాతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మినియాపొలిస్ నగరంలోని ఓ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న స్కూల్ విద్యార్థులపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరీ ముఖ్యంగా, ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన ఆయుధాలపై రాసిన సందేశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయుధాలపై "భారత్‌పై అణుదాడి చేయాలి", "డొనాల్డ్ ట్రంప్‌ను చంపాలి" వంటి వ్యతిరేక భావన కలిగించే రాతలు కనబడటం అందరినీ తీవ్రంగా ఆశ్చర్యపరిచింది.

వివరాలు 

దాడికి పాల్పడింది 23 ఏళ్ల రాబిన్ వెస్ట్‌మన్‌గా గుర్తింపు 

వివరాల్లోకి వెళితే, ఈ దాడి బుధవారం అన్నన్సియేషన్ క్యాథలిక్ స్కూల్‌కు చెందిన చర్చిలో జరిగింది. పోలీసులు నిందితుడిని 23 ఏళ్ల రాబిన్ వెస్ట్‌మన్‌గా గుర్తించారు. అతను రైఫిల్, షాట్‌గన్, పిస్టల్ వంటి మూడు ఆయుధాలను తీసుకొని చర్చిలో ప్రవేశించి, నిర్లక్ష్యంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి అనంతరం, అదే ప్రాంగణంలోని పార్కింగ్‌లో వెస్ట్‌మన్ తాను ఉపయోగించిన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. దాడికి ముందు, వెస్ట్‌మన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోను యూట్యూబ్ తొలగించింది. ఆ వీడియోలో అతను తన వద్ద ఉన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ప్రదర్శించాడు.

వివరాలు 

ఒక ఆయుధంపై "న్యూక్ ఇండియా" 

తుపాకుల మ్యాగజైన్‌లపై "కిల్ డొనాల్డ్ ట్రంప్", "ఇజ్రాయెల్ పతనం కావాలి", "పిల్లల కోసం", "మీ దేవుడు ఎక్కడ?" వంటి భయంకరమైన రాతలు కనిపించాయి. ఏకంగా ఒక ఆయుధంపై "న్యూక్ ఇండియా" (భారత్‌పై అణుదాడి చేయాలి) అని స్పష్టంగా రాసినట్లు తెలిసింది. అమెరికా హోంల్యాండ్ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఈ వీడియోలోని సమాచారం నిజమని ధృవీకరించారు. "తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్న ఈ హంతకుడు తన తుపాకీపై భయంకరమైన సందేశాలను రాశాడు" అని ఆమె 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా తెలిపారు.

వివరాలు 

ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి 

వెస్ట్‌మన్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదని, ఆయుధాలను చట్టబద్ధంగా కొనుగోలు చేశాడని,ఈ దాడిలో మరెవరు కూడా లేరని అధికారులు స్పష్టంచేశారు. ఈ ఏడాది అమెరికాలో జరిగిన ఇలాంటి కాల్పుల ఘటనలు 146వ సారి కావడం, అక్కడి తుపాకీ సంస్కృతిపై ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. ఈ దారుణ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాప సూచికంగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.