Page Loader
Big Beautiful Bill: బిగ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల 'సభ' ఆమోదం
బిగ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల 'సభ' ఆమోదం

Big Beautiful Bill: బిగ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల 'సభ' ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన లక్ష్యాన్ని సాధించారు. ఆయన కలల ప్రణాళికగా చెప్పుకునే 'బిగ్ బ్యూటిఫుల్ బిల్‌' (Big Beautiful Bill) కు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. గురువారం నాడు అమెరికన్ కాంగ్రెస్‌లో జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు 218 మంది సభ్యులు అనుకూలంగా, 214 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టిన ట్రంప్‌కు ఇది ఒక విశేష విజయంగా నిలిచింది. ఈ ఓటింగ్ సందర్భంగా ఇద్దరు రిపబ్లికన్ సభ్యులు డెమోక్రాట్లకు మద్దతుగా ఓటు వేయడం గమనార్హం. ప్రతినిధుల సభ,సెనెట్ ఆమోదంతో ఈ బిల్లును అధ్యక్షుడి సంతకానికి పంపారు.

వివరాలు 

బిల్లుకు వ్యతిరేకంగా సభ మైనారిటీ నేత హకీం జెఫ్రీస్ 

అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం సాయంత్రం దీనిపై సంతకం చేయనున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. దీంతో పన్నుల తగ్గింపు, ప్రభుత్వ ఖర్చుల నియంత్రణ వంటి అంశాలను లక్ష్యంగా చేసుకున్న ఈ బిల్లు త్వరలో చట్టంగా మారనుంది. ఈ విజయాన్ని ట్రంప్ ఆనందంగా స్వీకరించారు. లక్షలాది కుటుంబాలకు డెత్ ట్యాక్స్ నుంచి విముక్తి కల్పించగలిగానని హర్షం వ్యక్తం చేశారు. గురువారమే ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం దీని మీద సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుకు వ్యతిరేకంగా సభ మైనారిటీ నేత హకీం జెఫ్రీస్ 8 గంటల 32 నిమిషాలపాటు మాట్లాడారు. ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఈ బిల్లు ఆమోదాన్ని ఆయన రాజకీయ జీవితంలో అత్యంత గొప్ప విజయంగా అభివర్ణిస్తున్నారు.

వివరాలు 

 51-50 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం 

ఇంతకుముందే బుధవారం నాడు అమెరికా సెనెట్‌ ఈ వివాదాస్పద బిల్లును ఆమోదించింది. పన్నుల తగ్గింపులు, ప్రభుత్వ ఖర్చులకు సంబంధించి 1,000పేజీల పరిమాణంలో రూపొందించిన ఈ బిల్లుపై సెనెట్‌లో కూడా తీవ్ర చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 50, వ్యతిరేకంగా 50 ఓట్లు వచ్చాయి. ఈ సమాన ఓట్ల స్థితిని అధిగమించేందుకు సెనేట్ చైర్మన్‌గా ఉన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై-బ్రేకింగ్ ఓటు వేసి బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో 51-50 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఉపాధ్యక్షుడు వాన్స్ బిల్లు ఆమోదం పొందినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన ముగ్గురు సెనేటర్లు మాత్రం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది.

వివరాలు 

ఈ బిల్లులో కీలక అంశాలు 

ఈ బిల్లులో 4.5 ట్రిలియన్ డాలర్ల పన్నుల తగ్గింపులు,మెడికేడ్‌,ఫుడ్ స్టాంప్‌లలో 1.2 ట్రిలియన్ డాలర్ల ఖర్చు కోతలు ఉన్నాయి. సరిహద్దు భద్రత మెరుగుపరచడం,అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధులు కేటాయించడం వంటి కీలక అంశాలను ట్రంప్ ప్రభుత్వం ఇందులో చేర్చింది. అయితే ఈ బిల్లుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డెమోక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్ నాయకులు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు.

వివరాలు 

'అమెరికన్‌ పార్టీ' పేరిట కొత్త రాజకీయ పార్టీ

ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో,టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌, అధ్యక్షుడు ట్రంప్ మధ్య విభేదాలు పెరిగిన సంగతి తెలిసిందే. బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే 'అమెరికన్‌ పార్టీ' పేరిట కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు.