Iran: 24 గంటల్లో ఇరాన్‌పై సైనిక చర్య.. అమెరికా దాడులకు దిగొచ్చని కథనాలు
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు రెండు వారాలుగా హింసాత్మక నిరసనలతో ఉప్పొంగిపోతున్న ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు దిగడం దాదాపు అనివార్యంగా కనిపిస్తోంది. వచ్చే 24 గంటల్లోనే ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు 'రాయిటర్స్' సహా పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే దాడుల తీవ్రత ఎంత స్థాయిలో ఉండబోతుందన్న అంశంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదని పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, ఇరాన్‌కు సమీపంలోని ఖతార్‌లో ఉన్న కీలకమైన అల్-ఉదెయిద్ వైమానిక స్థావరం సహా పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న తమ పలు సైనిక స్థావరాల నుంచి అమెరికా ఇప్పటికే కొంతమంది సిబ్బందిని ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
మృతిచెందిన వారి సంఖ్య 2,571
ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, దాని ప్రాంతీయ మిత్రదేశాలు అల్-ఉదెయిద్ వైమానిక స్థావరంలో తాజాగా గగనతల రక్షణ కార్యకలాపాల కోసం ప్రత్యేక సెల్‌ను ప్రారంభించాయి. ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఖతార్‌లోని ఓ సైనిక స్థావరం నుంచి బ్రిటన్ కూడా తన సిబ్బందిని వెనక్కి పిలిపిస్తోంది. మరోవైపు, సంభవించే దాడులను ఎదుర్కొనేందుకు ఇరాన్ సైన్యం పూర్తిస్థాయిలో సిద్ధమైందని తెలుస్తోంది. ఇదే సమయంలో, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 2,571కు చేరిందని అధికారులు తెలిపారు. పరిస్థితి ఏ క్షణంలో ఎలా మారుతుందోనన్న భయంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనతో గడుపుతున్నారు.
వివరాలు
నిరసనకారులపై మానవత్వం చూపండి: ట్రంప్
నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న తీరుపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆందోళనకారుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని టెహ్రాన్‌కు తాజాగా సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ విషయంలో తీసుకోవాల్సిన భవిష్యత్ చర్యలపై ఆయన అమెరికా జాతీయ భద్రతా బృందంతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపినట్లు సమాచారం.
వివరాలు
ఆలస్యం చేయొద్దు: ఘొలామ్‌హుసేన్
అయితే ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ పక్కనపెట్టినట్లే కనిపిస్తోంది. అరెస్టయిన నిరసనకారులపై విచారణను వేగంగా పూర్తి చేసి,కఠిన శిక్షలు విధించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదని, ఆలస్యమైతే చర్యల ప్రభావం తగ్గిపోతుందని ఇరాన్ న్యాయవ్యవస్థాధిపతి ఘొలామ్‌హుసేన్ మొహ్సెనీ-ఎజీ బుధవారం వ్యాఖ్యానించారు. నిరసనకారులకు మరణశిక్ష విధించాలన్న ఆలోచనలో టెహ్రాన్ ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఆందోళనల సమయంలో మృతిచెందిన భద్రతా సిబ్బందిలో సుమారు 100 మందికి బుధవారం ఇరాన్ సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. ఆందోళనలతో కుదేలవుతున్న ఇరాన్‌లో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది.
వివరాలు
టెహ్రాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అంతర్జాల సేవలపై ఆంక్షలు
ఆందోళనలను అదుపు చేసేందుకు టెహ్రాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అంతర్జాల సేవలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ అందించే స్టార్‌లింక్ ద్వారానే ఇరాన్ పౌరులు బాహ్య ప్రపంచంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.
వివరాలు
ఇరాన్‌కు వెళ్లొద్దు: భారత్
ఇరాన్‌లో నిరసనల కారణంగా పరిస్థితులు మరింత క్షీణించడంతో పాటు,అమెరికా సైనిక చర్యలకు దిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇరాన్‌లో ఉన్న భారతీయులంతా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా అక్కడి నుంచి బయలుదేరాలని సూచించింది. అలాగే భారతీయులు ఎవరూ కొత్తగా ఇరాన్‌కు ప్రయాణించవద్దని విదేశీ వ్యవహారాల శాఖ గట్టిగా హెచ్చరించింది. ప్రస్తుతం ఇరాన్‌లో విద్యార్థులు సహా 10 వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్లు అంచనాలు చెబుతున్నాయి.