
US Visa: వలసదారులపై మరింత కఠినంగా అమెరికా.. బిజినెస్,టూరిస్ట్ వీసాల దరఖాస్తుదారులపై భారీ భారం ..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా వలస విధానాలపై ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం మరో కొత్త నిబంధనను అమలులోకి తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఇది ముఖ్యంగా బిజినెస్,టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి పై ప్రభావం చూపనుంది. సంప్రదాయంగా ఈ రెండు వర్గాల వీసాల కోసం దరఖాస్తు చేసే విదేశీయుల నుంచి భవిష్యత్ రక్షణగా "బాండ్" రూపంలో నగదు గిరవి తీసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా, దరఖాస్తుదారులు కనీసం 5,000 డాలర్లు, 10,000 డాలర్లు, లేదా 15,000 డాలర్లు సెక్యూరిటీ బాండ్ చెల్లించాల్సి వస్తుంది. ఈ బాండ్ మొత్తాన్ని వీసా దరఖాస్తు సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు
ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు ఈ పైలట్ పథకం అమల్లోకి..
ఈ కొత్త నిబంధనను పైలట్ ప్రోగ్రామ్ తరహాలో 12 నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయించింది. సంబంధిత ప్రకటనను ఫెడరల్ రిజిస్ట్రీలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం నాడు జారీ చేయనున్నారు. ఆ ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు ఈ పైలట్ పథకం అమల్లోకి వస్తుంది. ఈ బాండ్ చెల్లించినవారు తమ వీసా నిబంధనల మేరకు అమెరికాలో ఉండి, గడువుకి ముందే వెనుదిరిగితే.. కొన్ని సందర్భాల్లో ఆ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే, వారు చెల్లించిన బాండ్ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశమే ఉండదని అధికారులు స్పష్టం చేశారు.