US court to Delhi courts: భారత న్యాయస్థానాల ద్వారా ధోవల్‌కు సమన్లు.. అమెరికా కోర్టు కీలక ఉత్తర్వులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు భారత నిఘా సంస్థ రా (RAW) మాజీ చీఫ్ సమంత్ గోయల్‌కు అమెరికా కోర్టు సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. ఈ సమన్లను భారత న్యాయస్థానాల ద్వారా ప్రత్యామ్నాయ పద్ధతిలో అందజేయాలని సూచించింది. న్యూయార్క్‌లో తనపై జరిగిన హత్యాయత్నం కుట్ర వెనుక భారత అధికారుల హస్తం ఉందని ఆరోపిస్తూ సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ అమెరికాలో సివిల్ దావా వేశారు. ఈ కేసును విచారించిన న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
అజిత్ ధోవల్,సమంత్ గోయల్‌లకు సమన్లు
అమెరికా న్యాయ నిబంధనల ప్రకారం ఒక కేసులో విచారణ ముందుకు సాగాలంటే ప్రతివాదులకు సమన్లు అందజేయడం తప్పనిసరి.
ఈ నేపథ్యంలో 2024లో పన్నూన్ ది హేగ్ కన్వెన్షన్ ప్రకారం భారత న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా అజిత్ ధోవల్,సమంత్ గోయల్‌లకు సమన్లు పంపించేందుకు ప్రయత్నించారు.
అయితే ఈ సమన్లు హేగ్ కన్వెన్షన్ పరిధిలోకి రావని పేర్కొంటూ భారత ప్రభుత్వం వాటిని వెనక్కి పంపించింది.
దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో సమన్లు అందజేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పన్నూన్ అమెరికా కోర్టును ఆశ్రయించారు.
ఈ అభ్యర్థనను పరిశీలించిన అమెరికా జిల్లా కోర్టు..అవసరమైన న్యాయపరమైన పత్రాలను అంతర్జాతీయ మెయిల్ లేదా కొరియర్ ద్వారా ఢిల్లీలోని పాటియాలా హౌస్,తీస్ హజారీ,ద్వారకా జిల్లా కోర్టులకు పంపించాలని కోర్టు క్లర్క్‌ను ఆదేశించింది.
వివరాలు
ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సమన్లు అందజేయడం సాధారణంగా అనుసరించే న్యాయపరమైన విధానం
న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేథరిన్ పోల్క్ ఫైలా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఈ సమన్లకు కట్టుబడి ఉండాల్సిన చట్టపరమైన బాధ్యత సంబంధిత వ్యక్తులకు లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తమ కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్ దావాకు సంబంధించి ప్రతివాదులకు సమన్లు అందజేసే ప్రక్రియలో భారత న్యాయస్థానాల సహకారాన్ని గౌరవపూర్వకంగా కోరుతున్నట్లు అమెరికా జిల్లా కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సమన్లు అందజేయడం అనేది సాధారణంగా అనుసరించే న్యాయపరమైన విధానమేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదే తరహాలో గతంలోనూ సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ అమెరికాలో న్యాయపరమైన చర్యలు చేపట్టింది.
వివరాలు
ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సమన్లు అందజేయడం సాధారణంగా అనుసరించే న్యాయపరమైన విధానం
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఆ సంస్థ దావా వేసింది.
ఈ కేసుకు సంబంధించి అప్పటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు 2013లో సివిల్ సమన్లు జారీ అయ్యాయి.
వివరాలు
ఎవరీ గురుపత్వంత్ సింగ్ పన్నూన్?
గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పంజాబ్‌లోని అమృత్‌సర్ ప్రాంతంలో జన్మించారు.
1990వ దశకంలో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయనకు అమెరికాతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన పన్నూన్.. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే సంస్థను స్థాపించారు.
సిక్కుల కోసం ఖలిస్థాన్ పేరుతో ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ సంస్థ ప్రచారం చేస్తోంది.
అమెరికా, కెనడా దేశాల్లో ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలు, న్యాయపరమైన అంశాల్లో పన్నూన్ చురుగ్గా వ్యవహరిస్తుంటారు.
అయితే వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలతో 2019లో భారత ప్రభుత్వం సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థపై నిషేధం విధించింది.
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద పన్నూన్‌ను వ్యక్తిగత ఉగ్రవాదిగా ప్రకటించింది.
వివరాలు
ఎవరీ గురుపత్వంత్ సింగ్ పన్నూన్?
ఆయనపై భారత్‌లో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పంజాబ్, చండీగఢ్‌లో ఉన్న ఆయన ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జప్తు చేసింది.
పన్నూన్‌పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని భారత్ ఇప్పటికే రెండుసార్లు ఇంటర్‌పోల్‌ను కోరింది.
అయితే ఆయన ప్రత్యక్షంగా ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు లేవని పేర్కొంటూ ఇంటర్‌పోల్ ఆ విజ్ఞప్తులను తిరస్కరించింది.
వివరాలు
2023లో హత్యాయత్నం కుట్ర భగ్నం
2023లో న్యూయార్క్‌లో గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై హత్యాయత్నానికి జరిగిన కుట్రను అమెరికా అధికారులు భగ్నం చేశారు.
ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కుట్ర వెనుక భారత అధికారుల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ పన్నూన్ అమెరికా కోర్టుల్లో సివిల్ దావాలు వేశారు.
ఈ నేపథ్యంలోనే అజిత్ ధోవల్, సమంత్ గోయల్‌లకు సమన్లు అందజేయాలంటూ అమెరికా కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
భారత చట్టాల ప్రకారం పన్నూన్‌పై తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఉండగా.. అమెరికా న్యాయపరమైన ప్రక్రియలో మాత్రం ఆయన తనపై జరిగిన హత్యాయత్నానికి బాధితుడిగా దావా కొనసాగిస్తున్నారు.