Loading...
US flight chaos: అమెరికాలో కొనసాగుతున్న విమానయాన సంక్షోభం.. వేలాది విమాన సర్వీసులు రద్దు
అమెరికాలో కొనసాగుతున్న విమానయాన సంక్షోభం.. వేలాది విమాన సర్వీసులు రద్దు

US flight chaos: అమెరికాలో కొనసాగుతున్న విమానయాన సంక్షోభం.. వేలాది విమాన సర్వీసులు రద్దు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం మొదలైన ఈ సమస్య వారాంతం మొత్తం కొనసాగింది. దీంతో పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయగా, మరికొన్ని సర్వీసులు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. ఫలితంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం ఒక్కరోజే అమెరికా వ్యాప్తంగా సుమారు 8,800 విమానాలు ఆలస్యంగా నడిచినట్లు అధికారులు వెల్లడించారు. మరో 2,400 విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. విమానాలతో పాటు వాటి సిబ్బంది కూడా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

వివరాలు 

కంప్యూటర్ రూటర్ నుంచి తప్పుడు సంకేతాలు

విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరుకోవడానికి సోమవారం వరకు సమయం పట్టే అవకాశం ఉందని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ తెలిపారు.

ఏటీసీ సిబ్బంది, పైలట్ల మధ్య సమాచార మార్పిడిని పర్యవేక్షించే కీలక వ్యవస్థలో సాంకేతిక వైఫల్యం చోటుచేసుకోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

ఏటీసీ వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ రూటర్ నుంచి తప్పుడు సంకేతాలు వెలువడ్డాయి.

దీంతో సంబంధిత నెట్‌వర్క్ పూర్తిగా పనిచేయడం నిలిచిపోయిందని మంత్రి సీన్ డఫీ వివరించారు.

ఈ సాంకేతిక లోపానికి గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

వివరాలు 

ఏటీసీ వ్యవస్థ ఆధునికీకరణకు ట్రంప్ పిలుపు

అమెరికా విమానయాన రంగంలో ఏర్పడిన గందరగోళంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు కాంగ్రెస్ వెంటనే అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు.

ప్రస్తుతం వినియోగిస్తున్న ఏటీసీ వ్యవస్థలోని కీలక భాగాలు దాదాపు 50 ఏళ్ల నాటివని ఆయన పేర్కొన్నారు.

ఇంతటి పాత సాంకేతిక వ్యవస్థతో విమానయాన కార్యకలాపాలను నిర్వహించడం కష్టమని, దానిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT