Loading...
US Green Card: వలసదారులకు శాశ్వత నివాసం కోసం డెమొక్రాట్ల కొత్త ప్రతిపాదన
వలసదారులకు శాశ్వత నివాసం కోసం డెమొక్రాట్ల కొత్త ప్రతిపాదన

US Green Card: వలసదారులకు శాశ్వత నివాసం కోసం డెమొక్రాట్ల కొత్త ప్రతిపాదన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో అక్రమ వలసదారులకు ఊరట కలిగించేలా డెమోక్రటిక్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలో కనీసం పదేళ్లుగా నివసిస్తున్నప్పటికీ, ఇప్పటికే బహిష్కరణ (డిపోర్టేషన్) ఉత్తర్వులు ఎదుర్కొంటున్న కొంతమంది వలసదారులకు శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డు) పొందే అవకాశం కల్పించాలన్నది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. 'ప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్' పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ప్రకారం..నిర్దేశించిన అర్హతలు కలిగిన వారు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కొన్ని రకాల బహిష్కరణ ఉత్తర్వులకు పదేళ్ల కాలపరిమితి విధించాలని కూడా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇలాంటి ఉత్తర్వులకు ఆటోమేటిక్‌గా గడువు ముగిసే నిబంధన లేదు.

వివరాలు 

బిల్లులో పేర్కొన్న అర్హతలు ఇవే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై తనిఖీలు, బహిష్కరణ చర్యలను ముమ్మరం చేస్తున్న సమయంలో ఈ బిల్లు తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ ప్రతినిధులు లతీఫా సైమన్, జోయ్ లోఫ్గ్రెన్, జాన్ గరమెండి, జువాన్ వర్గాస్ నవంబర్ 19న ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

అయితే అమెరికాలో బహిష్కరణ ఎదుర్కొంటున్న వారందరికీ ఈ అవకాశం వర్తించదు. కొన్ని నిర్దిష్ట అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.

తుది బహిష్కరణ లేదా దేశం నుంచి పంపించే ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా కనీసం పదేళ్లపాటు అమెరికాలో నిరంతరంగా నివసించి ఉండాలి.

ఇమ్మిగ్రేషన్ చట్టంలోని నిర్దిష్ట నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే ఈ పథకానికి అర్హత పొందుతాయి.

వివరాలు 

గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేయాలంటే ఈ అర్హతలు తప్పనిసరి

ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలన్న నిబంధనలు లేదా షరతులతో కూడిన విడుదలకు సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించకూడదు.

అంతేకాకుండా అమెరికా చట్టాల ప్రకారం అనర్హతకు కారణమయ్యే కొన్ని తీవ్రమైన నేరాలు లేదా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు ఉండకూడదు.

దరఖాస్తుదారులు తమ తాజా ఫెడరల్ ఆదాయపు పన్ను రిటర్న్ ధ్రువీకరించిన ప్రతిని కూడా సమర్పించాలి.

ఈ దరఖాస్తు కోసం ఒకేసారి గరిష్ఠంగా 1,200 డాలర్ల వరకు ఫీజు వసూలు చేసే అధికారాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి ఈ బిల్లు కల్పిస్తుంది.

అర్హులైన వారి బహిష్కరణ ఉత్తర్వులను రద్దు చేసి, శాశ్వత నివాస హోదా కల్పించే అధికారం అటార్నీ జనరల్ లేదా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శికి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

బహిష్కరణ ఉత్తర్వులకు పదేళ్ల గడువు

ఈ బిల్లులో మరో కీలక ప్రతిపాదన ఏమిటంటే.. కొన్ని రకాల తుది బహిష్కరణ ఉత్తర్వులు పదేళ్ల తర్వాత చెల్లుబాటు కాకుండా పోవాలి.

ప్రస్తుతం అమెరికా చట్టాల ప్రకారం ఇలాంటి ఉత్తర్వులకు ఎలాంటి ఆటోమేటిక్ గడువు లేదు.

ప్రభుత్వం వెంటనే బహిష్కరణ చర్యలు చేపట్టకపోయినా అవి నిరవధికంగా అమల్లో ఉంటాయి.

కొత్త ప్రతిపాదన ప్రకారం పదేళ్ల గడువు ముగిసిన తర్వాత కూడా బహిష్కరణ ఉత్తర్వును కొనసాగించాలనుకుంటే.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తిని ఆశ్రయించాలి.

బహిష్కరణ అమలులో ఎందుకు ఆలస్యమైందో వివరించడంతోపాటు, ఉత్తర్వును పొడిగించడం ప్రజా ప్రయోజనాలకు అవసరమని నిరూపించాలి.

ADVERTISEMENT

వివరాలు 

బహిష్కరణ ఉత్తర్వులకు పదేళ్ల గడువు

ఒకవేళ గడువు ముగిసినా ఉత్తర్వును పొడిగించకపోతే.. సంబంధిత వ్యక్తి తనకు అర్హత ఉన్న మరో ఇమ్మిగ్రేషన్ హోదా కోసం అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగాన్ని (USCIS) ఆశ్రయించవచ్చు.

ఇందుకోసం కనీసం పదేళ్ల నిరంతర నివాసానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలి. అలాగే నేరాలకు సంబంధించిన అర్హత నిబంధనలను కూడా పాటించాలి.

దరఖాస్తు పరిశీలనలో ఉన్నంతకాలం బహిష్కరణ ఉత్తర్వును మళ్లీ పొడిగించడానికి వీలుండదు.

అయితే బహిష్కరణ ఉత్తర్వు గడువు ముగిసినంత మాత్రాన ఆటోమేటిక్‌గా గ్రీన్‌కార్డు లభించదు. సంబంధిత వ్యక్తి ఇతర అర్హతలను కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది.

వివరాలు 

భారత సంతతికి చెందిన హర్జీత్ కౌర్ కేసు నేపథ్యంలో..

అమెరికాలో దశాబ్దాలుగా నివసిస్తున్నప్పటికీ బహిష్కరణ ఎదుర్కొంటున్న వారి సమస్యలను ఈ బిల్లు మరోసారి చర్చకు తీసుకొచ్చింది.

ఇందుకు ఉదాహరణగా భారత సంతతికి చెందిన 73 ఏళ్ల హర్జీత్ కౌర్ కేసును ప్రస్తావిస్తున్నారు.

2025 సెప్టెంబరులో సాధారణ ఇమ్మిగ్రేషన్ తనిఖీ కోసం హాజరైన సమయంలో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం భారత్‌కు పంపించారు. హర్జీత్ కౌర్ కాలిఫోర్నియాలో 30 ఏళ్లకు పైగా నివసించారు.

అక్కడే తన పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఆ తర్వాత మనవళ్లు, మనవరాళ్లను కూడా చూసుకుంటూ వచ్చారు.

ఇన్నేళ్లపాటు అమెరికాలో జీవితం కొనసాగించినప్పటికీ ఆమెను బహిష్కరించడంతో దీర్ఘకాలంగా అక్కడ నివసిస్తున్న వలసదారుల సమస్యపై చర్చ మొదలైంది.

వివరాలు 

భారత సంతతికి చెందిన హర్జీత్ కౌర్ కేసు నేపథ్యంలో..

ఇలాంటి పాత బహిష్కరణ ఉత్తర్వుల కారణంగా ఎన్నో ఏళ్లుగా అమెరికాలో స్థిరపడిన వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించేందుకు ఈ కేసును బిల్లు మద్దతుదారులు ప్రస్తావిస్తున్నారు.

అయితే ఈ కొత్త ప్రతిపాదన ఆమోదం పొందినా హర్జీత్ కౌర్‌కు ఆటోమేటిక్‌గా అమెరికాకు తిరిగి వచ్చే అవకాశం ఉండదు.

ఆమె కూడా బిల్లులో పేర్కొన్న అర్హతలను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

వివరాలు 

అమెరికాలో 16 లక్షల మందికి బహిష్కరణ ఉత్తర్వులు

ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే పెద్ద సంఖ్యలో వలసదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదికలో పేర్కొన్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) గణాంకాల ప్రకారం.. 2026 ఫిబ్రవరి 26 నాటికి ఐసీఈ నిర్బంధంలో లేని వారి జాబితాలో సుమారు 16 లక్షల మందిపై తుది బహిష్కరణ ఉత్తర్వులు ఉన్నాయి.

ఒక వ్యక్తి అమెరికాను విడిచిపోవాలని సంబంధిత అధికారులు తుది ఆదేశాలు జారీ చేయడం, అప్పీళ్ల గడువు ముగియడం లేదా అందుబాటులో ఉన్న పరిపాలనా అప్పీళ్ల ప్రక్రియ పూర్తికావడాన్ని ఫైనల్ రిమూవల్ ఆర్డర్‌గా పరిగణిస్తారు.

అయితే ఇలాంటి ఉత్తర్వులు వచ్చినంత మాత్రాన వెంటనే దేశం నుంచి పంపిస్తారని అర్థం కాదు.

వివరాలు 

బిల్లుకు ఆమోదం లభిస్తుందా?

కోర్టు విచారణలు,న్యాయపరమైన సవాళ్లు, ఇతర పరిపాలనా కారణాలతో బహిష్కరణ ప్రక్రియ ఆలస్యం కావచ్చు లేదా తాత్కాలికంగా నిలిచిపోవచ్చు.

ప్రస్తుతం ఈ బిల్లు చట్టంగా మారడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిపైనా రిపబ్లికన్ల ఆధిపత్యం ఉంది.

దీంతో ప్రస్తుత కాంగ్రెస్ సమావేశాల ముగింపులోపు ఈ బిల్లుపై చర్చ జరుగుతుందా? అన్నది అనిశ్చితిగా మారింది.

అయితే 2026 మధ్యంతర ఎన్నికల్లో విజయాల తర్వాత 2027 జనవరిలో ప్రతినిధుల సభతోపాటు సెనేట్‌లోనూ డెమోక్రాట్లు ఆధిపత్యం చేపట్టనున్నట్లు కథనంలో పేర్కొన్నారు.

వివరాలు 

బిల్లుకు ఆమోదం లభిస్తుందా?

దీంతో వచ్చే ఏడాది ఈ ప్రతిపాదన మళ్లీ చర్చకు వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌లో ఆమోదం పొందినప్పటికీ చివరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయాల్సి ఉంటుంది.

వలసల అంశంలో డెమోక్రాట్లతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపినప్పటికీ, తన ప్రభుత్వం కఠినమైన ఇమ్మిగ్రేషన్ అమలు చర్యలను కొనసాగిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.

సాధారణ క్షమాభిక్ష (అమ్నెస్టీ) రూపంలో ఎలాంటి ఒప్పందానికీ అంగీకరించబోనని కూడా ఆయన గతంలో పేర్కొన్నారు.

దీంతో ఈ కొత్త గ్రీన్‌కార్డు ప్రతిపాదన భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT