Page Loader
US News: విదేశీ అధికారులపై అమెరికా వీసా నిషేధం: సోషల్ మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు కీలక అడుగు 
సోషల్ మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు కీలక అడుగు

US News: విదేశీ అధికారులపై అమెరికా వీసా నిషేధం: సోషల్ మీడియా స్వేచ్ఛను కాపాడేందుకు కీలక అడుగు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికా మరో కీలకమైన విధాన నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రభుత్వాల అధికారి‍లు తమ దేశ ప్రజల సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలపై సెన్సార్ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించడాన్ని నిరోధించేందుకు యూఎస్‌ తాజాగా వీసా నిషేధ విధానాన్ని అమలు చేయనుంది. అమెరికా పౌరులు సోషల్ మీడియాలో చేసే పోస్టులను తొలగించమని ఒత్తిడి చేసే విదేశీ అధికారులపై ఈ నిషేధం అమలవుతుందని ప్రకటించింది. అంతేకాదు,అమెరికాకు చెందిన సోషల్ మీడియా సంస్థలపై కంటెంట్‌ను తొలగించమని నోటీసులు పంపే అధికారులకూ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఇటీవలి కాలంలో పలు దేశాల ప్రభుత్వాలు అమెరికాలోని సోషల్ మీడియా సంస్థలపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు యూఎస్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వివరాలు 

పౌరుల స్వేచ్ఛను పరిరక్షించేందుకు పాలసీ: అమెరికా విదేశాంగ శాఖ 

ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ, ''అమెరికా పౌరులు లేదా రెసిడెంట్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, వ్యాఖ్యలను తొలగించమని ఒత్తిడి చేయడం, వారిపై అరెస్ట్ వారంట్లు జారీ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్న విదేశీ అధికారులపై ఈ పాలసీ కేంద్రీకరించింది'' అని స్పష్టం చేశారు. ఈ విధమైన చర్యలు నైతిక ప్రమాణాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అంతేగాక, ప్రపంచవ్యాప్తంగా ఉండే కంటెంట్ మోడరేషన్ విధానాల పేరిట తమ అధికార పరిధిని మించి అమెరికా టెక్ కంపెనీలపై సెన్సార్ చర్యలు తీసుకోవడం కూడా సమంజసం కాదని ఆయన అన్నారు.

వివరాలు 

ఏ దేశం అని స్పష్టంగా చెప్పని అమెరికా 

మార్కో రూబియో ఈ సందర్భంగా ఏ దేశాన్నీ నేరుగా పేర్కొనలేదు. అయితే ఇటీవల కొన్ని విదేశీ ప్రభుత్వాల అధికారులు ఎలాంటి చట్టపరమైన అధికారం లేకుండానే అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థలపై సెన్సార్ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవలి కాలంలో కొన్ని దేశాలు అమెరికా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్న పోస్టులపై చట్టపరమైన చర్యలు చేపట్టాయి. జరిమానాలు విధించడం వంటి చర్యలూ తీసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే అమెరికా ఈ కొత్త విధానాన్ని ప్రకటించింది.

వివరాలు 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై అమెరికా ఆధిపత్యం 

అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం, యూఎస్ పౌరులు అమెరికా భూభాగం నుంచి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేయడాన్ని ఇతర దేశాలు నియంత్రించలేవు. అలాంటి చర్యలకు చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది. ప్రపంచంలోని ప్రధానమైన సోషల్ మీడియా సంస్థలు ఎక్కువగా అమెరికన్లకు చెందినవే ఉన్నాయి. ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ (మార్క్ జూకర్‌బర్గ్), యూట్యూబ్‌ (గూగుల్), ఎక్స్‌ (ట్విటర్‌కు పూర్వపేరు, ఎలాన్ మస్క్‌), ట్రూత్‌ (డొనాల్డ్ ట్రంప్‌), బ్లూస్కై (జాక్ డోర్సే) వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అన్నీ అమెరికాకు చెందినవే కావడం గమనార్హం.