
Iran-Israel: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం.. రష్యా, చైనా ఏం చేయబోతున్నాయి?
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటిదాకా ఒక్క లెక్క... ఇప్పటినుండి ఇంకో లెక్క. అణ్వస్త్ర దేశం ఇరాన్‌కు అమెరికా ఇచ్చిన కఠిన హెచ్చరిక ఇదే. 'యుద్ధం వద్దు, బిజినెస్ ముద్దు' అని పలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి దూకారు. ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం కురిపించడం ద్వారా కొత్త మలుపు తిరిగింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ట్రంప్ యాక్టివ్ మోడ్ లోకి రాగా, అమెరికా నేరుగా ఈ ఘర్షణలో ప్రవేశించవచ్చని ఊహాగానాలు నిజమవుతున్నాయి. శనివారం (జూన్ 21) అమెరికా ఇరాన్‌లోని 3 అణుకేంద్రాలపై బాంబుల దాడులు జరిపింది. ఈ చర్య తర్వాత రష్యా, చైనా ఎలా స్పందిస్తాయనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. తాజా దాడులపై చైనా తీవ్రంగా స్పందించింది.
Details
సంభాషణలకు ప్రాధాన్యత ఇవ్వాలి
అమెరికా మునుపటి వ్యూహాత్మక తప్పిదాలను పునరావృతం చేస్తోందని చైనా హెచ్చరించింది.2003 ఇరాక్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, మధ్యప్రాచ్యంలో సైనిక జోక్యం తరచుగా ప్రమాదకర ఫలితాలకు దారితీస్తుందని చరిత్ర పునరుద్ఘాటిస్తోందని పేర్కొంది. శాంతిని కాపాడుకోవాలంటే సైనిక చర్యలకు కాకుండా, దౌత్యం, సంభాషణలకు ప్రాధాన్యత ఇవ్వాలని చైనా సూచించింది. ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభాన్ని అధ్యక్షుడు ట్రంప్ రేకెత్తిస్తున్నారని చైనా ఆరోపించింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణను అమెరికా ఉద్దేశపూర్వకంగా ప్రేరేపిస్తోందని పేర్కొంది. చైనా అధికారిక మీడియా ప్రకారం, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్ని పక్షాలను, ముఖ్యంగా ఇజ్రాయెల్‌ను దాడులను నిలిపివేయాలని కోరారు. ఇక రష్యా అమెరికా దాడులపై అధికారికంగా స్పందించకపోయినప్పటికీ, ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలో అమెరికా జోక్యానికి వ్యతిరేకత వ్యక్తం చేసింది.
Details
ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన పరిణామాలు
గత గురువారం (జూన్ 19) రష్యా అణుశక్తి సంస్థ ఛైర్మన్ మాట్లాడుతూ, ఇరాన్ బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి జరగితే అది 'చెర్నోబిల్' తరహా ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంతకుముందే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను ప్రతిపాదించినా, డొనాల్డ్ ట్రంప్ ఆ ప్రతిపాదనను తిరస్కరించి, ముందుగా ఉక్రెయిన్ అంశాన్ని పరిష్కరించాలని సూచించారు. ఆయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని హత్యా ప్రయత్నం జరుగితే అది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని రష్యా ఇంతకుముందే అమెరికా, ఇజ్రాయెల్‌లకు హెచ్చరించింది.
Details
ఇరాన్ కు దౌత్యపరంగా మద్దతిచ్చే అవకాశం
స్కై న్యూస్ ప్రకారం, ఇరాన్ నేతను తొలగించే ప్రయత్నం మధ్యప్రాచ్యంలో మరింత గందరగోళాన్ని రేకెత్తిస్తుందని క్రెమ్లిన్ పేర్కొంది. ఇరాన్‌పై అమెరికా దాడి తర్వాత రష్యా, చైనా ఏం చేయబోతున్నాయనేది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక ప్రశ్న. వారు ఇరాన్ కు నేరుగా మద్దతిస్తారా? ప్రస్తుతం రెండు దేశాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలో రష్యా, చైనా సంయమనానికి పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రష్యా, చైనా నిశ్శబ్దంగా ఇరాన్ కు దౌత్యపరంగా మద్దతిచ్చే అవకాశం కూడా ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు రెండు దేశాల భవిష్యత్తు వ్యూహం ఏదో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.