Page Loader
USA: అత్యంత శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3 క్షిపణిని పరీక్షించిన అమెరికా..! 
అత్యంత శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3 క్షిపణిని పరీక్షించిన అమెరికా..!

USA: అత్యంత శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3 క్షిపణిని పరీక్షించిన అమెరికా..! 

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు క్షిపణి అయిన మినిట్‌మ్యాన్‌-3ను విజయవంతంగా పరీక్షించింది. ఇదే సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 'గోల్డెన్‌ డోమ్‌' పేరుతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ పరీక్ష అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని వాండెన్‌బెర్గ్‌ స్పేస్‌ బేస్‌లో నిర్వహించారు. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ళ (సుమారు 24,000 కి.మీ) వేగంతో ప్రయాణించి, సుమారు 4,200 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేసింది. చివరికి ఇది మార్షల్‌ దీవుల్లో ఉన్న అమెరికా స్పేస్‌ అండ్‌ మిసైల్‌ డిఫెన్స్‌ కమాండ్‌ నిర్వహించే బాలిస్టిక్‌ డిఫెన్స్‌ టెస్ట్‌ సైట్‌ వద్ద విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది.

వివరాలు 

మినిట్‌మ్యాన్‌-3 క్షిపణిలో  మార్క్‌-21 రీఎంట్రీ వెహికల్‌ 

ఈ పరీక్ష సందర్భంగా అమెరికా గ్లోబల్‌ స్ట్రైక్‌ కమాండ్‌కు చెందిన జనరల్‌ థామస్‌ బుస్సెరీ స్పందిస్తూ, "ఈ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ICBM) పరీక్ష అమెరికా సైనిక సన్నద్ధతకు,శక్తికి నిదర్శనంగా నిలిచింది," అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలకు ఈ పరీక్షకు ఎలాంటి సంబంధం లేదని,ఇది కేవలం నియమిత ప్రాక్టీస్‌ చర్యగా చేపట్టినదేనని స్పష్టం చేశారు. మినిట్‌మ్యాన్‌-3 క్షిపణిలో అత్యంత శక్తిమంతమైన మార్క్‌-21 రీఎంట్రీ వెహికల్‌ అమర్చబడుతుంది. ఇందులో అణు పేలోడ్‌ను స్థాపించవచ్చును.గతంలో కూడా ఈ క్షిపణి సామర్థ్యాన్ని పలు మార్లు పరీక్షించారు. గత ఏడాది నవంబర్‌లో ట్రంప్‌ ఎన్నికల విజయం సాధించే ముందు కూడా ఒకసారి దీనిని పరీక్షించారు.

వివరాలు 

1970ల నాటి మినిట్‌మ్యాన్‌

మినిట్‌మ్యాన్‌ అనేది 1970ల నాటిది అయినప్పటికీ,ఇప్పటికీ ఇది అమెరికా వాయుసేనకు అత్యంత నమ్మకమైన అణు క్షిపణిగా కొనసాగుతోంది. భవిష్యత్తులో దీనిని సెంటినెల్‌ వ్యవస్థతో మార్చే యోచనలో ఉన్నా, ప్రస్తుతానికి మినిట్‌మ్యాన్‌-3కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు, భవిష్యత్‌లో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా కాపాడేందుకు 'గోల్డెన్‌ డోమ్‌' అనే ఆధునిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని అమెరికా నిశ్చయించింది. ఇందుకోసం అధ్యక్షుడు ట్రంప్‌ వైట్‌హౌస్‌లో కీలక ప్రకటన చేస్తూ, ఇజ్రాయెల్‌ 'ఐరన్‌ డోమ్‌'ను ఆదర్శంగా తీసుకుని అమెరికా గోల్డెన్‌ డోమ్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు.

వివరాలు 

ట్రంప్ పదవీకాలం ముగిసేలోగా గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణం 

ఈ వ్యవస్థకు రూ.15 లక్షల కోట్ల (175 బిలియన్‌ డాలర్లు) ఖర్చు అవుతుందని చెప్పారు. అంతేకాదు, అమెరికా అంతరిక్షంలో ఆయుధాలను మోహరించడానికి కూడా సిద్ధమవుతోందని వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును యూఎస్‌ స్పేస్‌ ఫోర్స్‌కి చెందిన జనరల్‌ మైఖేల్‌ గుట్లీన్‌ పర్యవేక్షించనున్నారని ట్రంప్‌ ప్రకటించారు. తన పదవీకాలం ముగిసేలోగా గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 మినిట్‌మ్యాన్‌-3 క్షిపణిని పరీక్షించిన అమెరికా