Kashyap Kash Patel: గూఢచారి సంస్థ చీఫ్‌గా భారత సంతతికి చెందిన వ్యక్తి.. ఇతను ఎవరంటే?
నాలుగేళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసారి ఆయనకు అన్ని వర్గాల మద్దతు లభించడం, ముఖ్యంగా భారతీయ అమెరికన్లు, మైనార్టీల నుంచి మద్దతు అందడమే ఆయన విజయానికి కారణమైంది. గత ఎన్నికల్లో త్రుటిలో ఓటమి చెందినా, ఇప్పుడు ట్రంప్ అద్భుతమైన విజయం సాధించారు. ఈ క్రమంలో, ట్రంప్ యంత్రాంగంలో పలు కీలక స్థానాల్లో భారత సంతతికి చెందిన అమెరికన్లు నియమింపబడతారని భావిస్తున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్‌గా భారత సంతతికి చెందిన కశ్యప్ కాష్ పటేల్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయి.
ఏవియేషన్ కంపెనీలో ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా..
ట్రంప్‌కు సమీప సహాయకుడిగా ఉన్న కశ్యప్ గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అతను ఎవరు, అతని నేపథ్యం ఏమిటి అనే విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. గుజరాతీ మూలాలున్న కాష్ పటేల్, తన పూర్వీకులతో సహా తూర్పు ఆఫ్రికా నుంచి కెనడాకు వలస వెళ్లి, తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో జన్మించిన కాష్ పటేల్, అతని తండ్రి ఒక ఏవియేషన్ కంపెనీలో ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేశారు. పేస్ యూనివర్సిటీ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్, లండన్ యూనివర్సిటీ కాలేజీ నుంచి అంతర్జాతీయ న్యాయ విభాగంలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన కాష్, మొదట్లో ప్రతిష్టాత్మక లా సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు.
ఉగ్రవాద నిరోధక సలహాదారుగా..
అనంతరం పబ్లిక్ డిఫెండర్‌గా మారి, లోకల్ అండ్ ఫెడరల్ కోర్టులో 9 ఏళ్లు న్యాయపరమైన సేవలు అందించారు. 2019లో, ట్రంప్ సన్నిహితుడు రెప్. డేవిడ్ నూన్స్ నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ కమిటీలో కాష్ పటేల్ నియమితులయ్యారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఆయన జాతీయ భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక సలహాదారుగా, చివరి పదవీ కాలంలో తాత్కాలిక రక్షణ కార్యదర్శి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పని చేశారు. పలు కీలకమైన న్యాయ, భద్రతా బాధ్యతలు నిర్వహించారు. ఆల్ ఖైదా, ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల అగ్రనాయకులను నిర్మూలించడంలో కాష్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అలాగే అనేక బందీలను విడిపించడంలో సహకరించారు.
జాతీయ భద్రతా మండలిలో కీలక స్థానం
కాష్ పటేల్ "న్యూన్స్ మెమో" అనే నివేదికను రచించినట్టు సమాచారం, ఇది ట్రంప్ ప్రచార వాలంటీర్లపై నిఘా పెట్టేందుకు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ చేసిన కుట్రలను బయటపెట్టినట్లుగా ఫస్ట్ పోస్ట్ నివేదించింది. ఈ నివేదిక విడుదలపై న్యాయ శాఖ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలతో కాష్ పటేల్ ట్రంప్ దృష్టిలోకి వచ్చారు, తద్వారా ఆయన జాతీయ భద్రతా మండలిలో కీలక స్థానంలో నియమితులయ్యారు.