Loading...
Dalai Lama succession: దలైలామా వారసత్వంపై అమెరికా కీలక ప్రతిపాదన.. భారత్‌తో ఉన్నతస్థాయి చర్చలు
దలైలామా వారసత్వంపై అమెరికా కీలక ప్రతిపాదన.. భారత్‌తో ఉన్నతస్థాయి చర్చలు

Dalai Lama succession: దలైలామా వారసత్వంపై అమెరికా కీలక ప్రతిపాదన.. భారత్‌తో ఉన్నతస్థాయి చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

దలైలామా తదుపరి వారసుడి ఎంపిక వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. ఈ ప్రక్రియలో చైనా జోక్యాన్ని అడ్డుకోవడానికి అమెరికా కొత్త వ్యూహానికి తెరతీసింది. 14వ దలైలామా తర్వాత ఆయన వారసుడిని ఎంపిక చేసే విషయంలో భారత్‌తో ఉన్నతస్థాయి సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని అమెరికా కాంగ్రెస్‌ కమిషన్‌ ప్రతిపాదించింది. ఈ వారసత్వ ప్రక్రియను చైనా తన అంతర్జాతీయ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్‌ కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో ఈ మేరకు పలు కీలక సూచనలు చేసింది. దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు చైనా ఒత్తిడి వ్యూహాలను ప్రయోగించే ప్రమాదం ఉందని పేర్కొంది.

వివరాలు 

భారత్‌తో ఉన్నతస్థాయి సంప్రదింపుల వ్యవస్థ ఏర్పాటు

చైనా స్వయంగా ఎంపిక చేసిన లేదా నియమించిన వ్యక్తిని దలైలామా వారసుడిగా అమెరికా గుర్తించకూడదని స్పష్టం చేసింది.

ఈ విషయంలో భారత్‌తో సమన్వయం చేసుకోవడం అవసరమని కమిషన్‌ అభిప్రాయపడింది.

ఇందుకోసం భారత్‌తో ఉన్నతస్థాయి సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని అమెరికా విదేశాంగ మంత్రికి సూచించింది.

చైనా చేపట్టే ప్రభావ కార్యకలాపాలకు సంబంధించిన నిఘా సమాచారాన్ని ఇరు దేశాలు పరస్పరం పంచుకోవాలని పేర్కొంది.

దలైలామా వారసుడి ఎంపికకు సంబంధించి భవిష్యత్తులో చోటుచేసుకునే పరిణామాలపై భారత అధికారులతో నిరంతరం చర్చలు జరపాలని సిఫార్సు చేసింది.

వివరాలు 

భద్రతా విభాగాలతో ప్రత్యేక కసరత్తు

దలైలామా వారసుడి ఎంపిక సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థంగా స్పందించేందుకు అమెరికా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కమిషన్‌ సూచించింది.

ఈ కసరత్తులో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు, నిఘా విభాగం డైరెక్టర్‌, రక్షణ మంత్రి భాగస్వాములు కావాలని తెలిపింది.

చైనా ఎంపిక చేసిన వ్యక్తికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించకుండా అమెరికా తన మిత్రదేశాలతో కలిసి దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

వారసుడిని గుర్తించే అధికారం ట్రస్ట్‌కే!

2011లో దలైలామా ఏర్పాటు చేసిన గాదెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు ఆయన తదుపరి పునర్జన్మను గుర్తించే పూర్తి అధికారం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

ఈ ప్రక్రియలో చైనా జోక్యానికి అవకాశం ఇవ్వకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

మరోవైపు, టిబెట్‌ కేంద్ర పాలనా యంత్రాంగంపై చైనా సైబర్‌ దాడులు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా తప్పుడు ప్రచారాలు చేపట్టే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

ఇలాంటి ముప్పులను ఎదుర్కొనేందుకు టిబెట్‌ కేంద్ర పాలనా యంత్రాంగం సాంకేతిక, భద్రతా సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలని అమెరికా కమిషన్‌ సూచించింది.

ADVERTISEMENT