
Donald Trump: నేడు ఓవల్ కార్యాలయంనుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్ నుంచి ఒక ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న టారిఫ్‌ల (పన్నుల) అంశంలో అనిశ్చితి వాతావరణం మధ్య ఈ ప్రకటన వెలువడనుందని వైట్ హౌస్ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ తెలిపింది. అమెరికా సమయ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు) ట్రంప్ ఈ ప్రకటన చేయనున్నారు. సెప్టెంబర్ 1న అమెరికాలో లేబర్ డే జరుపుకున్న తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇటీవలి కాలంలో ట్రంప్ పాలనలో చోటుచేసుకున్న పరిణామాల మధ్య ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
ట్రంప్ ఏం ప్రకటిస్తారో అన్న ఆసక్తి..
ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి తీసుకురావాలన్న ట్రంప్ ప్రయత్నాలు ఫలించకపోగా, మరోవైపు షాంఘై సహకార సంస్థ (SCO)సదస్సులో భారత్, చైనా,రష్యా దేశాల మధ్య ఏర్పడుతున్న సన్నిహిత సంబంధాలు కూడా ట్రంప్ దృష్టిని ఆకర్షించే అంశాలుగా మారాయి. అదే సమయంలో భారత్‌పై 50శాతం టారిఫ్ ఇంకా కొనసాగుతుండటంతో,మిత్రదేశాల మధ్య సంబంధాలు గత రెండు వారాలుగా ఉద్రిక్తతకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏం ప్రకటిస్తారో అన్న ఆసక్తి పెరుగుతోంది.అమెరికా దేశీయ రాజకీయాల పరంగా చూస్తే,వాషింగ్టన్ డీసీపై ట్రంప్ వైఖరి,అలాగే షికాగో వంటి డెమొక్రాటిక్ నగరాల్లో అమెరికా సైన్యాన్ని ప్రవేశపెట్టే 'శాంతి పరిరక్షణ' ప్రణాళికలు కూడా దేశంలోనే విస్తృత చర్చకు దారితీశాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ప్రకటించబోయే విషయం అంతర్జాతీయంగానూ,దేశీయంగానూ ప్రాధాన్యం సంతరించుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.