UNSC: భారతదేశానికి UNSCలో శాశ్వత సీటుకు ఎలోన్ మస్క్ మద్దతు .. అమెరికా స్పందనిదే..
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)తో సహా UN సంస్థల సంస్కరణలకు అమెరికా మద్దతు ఇచ్చింది. ఈ సమాచారాన్ని US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. UNSCలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని టెస్లా CEO ఎలాన్ మస్క్ చేసిన ప్రకటన గురించి కూడా వేదాంత్ పటేల్ మాట్లాడారు. ''ఐరాసలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్ (Joe Biden) గతంలో సర్వప్రతినిధి సభలో మాట్లాడారు. విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చారు. భద్రతా మండలి సహా ఐరాస సంస్థల్లో సంస్కరణలకు మేం ఎప్పుడూ అనుకూలమే. ఐరాసలో ప్రాతినిధ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలి'' అని మీడియా సమావేశంలో వేదాంత్ పటేల్ అన్నారు.
UNSCలో భారత్‌కు శాశ్వత స్థానం లభించకపోవడం అసంబద్ధం
జనవరిలో, ఎలోన్ మస్క్ UNSCలో భారత్‌కు శాశ్వత స్థానం లేకపోవడం 'అసంబద్ధం' అని అన్నారు. ఆఫ్రికా దేశాలన్నింటికీ కలిపి కూడా ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించేందుకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. దీనికి అంతర్జాతీయ సమాజం సైతం మద్దతునిస్తుండడం విశేషం.
UNSCలో ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి?
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) 15 సభ్య దేశాలతో రూపొందించబడింది. వీటిలో ఐదు శాశ్వత సభ్యులు వీటో అధికారం కలిగి ఉన్నారు. మరో పది దేశాలు రెండేళ్ల కాలపరిమితితో తాత్కాలిక సభ్యదేశాలుగా ఎన్నికవుతూ ఉంటాయి. UNSCలోని ఐదు శాశ్వత సభ్యులలో చైనా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా ఉన్నాయి. అయితే నాన్-పర్మనెంట్ సభ్యులు UNGAచే 2 సంవత్సరాల పదవీకాలానికి ఎన్నికవుతారు.
యుఎన్‌ఎస్‌సిలో స్థానం సంపాదించాలని బిజెపి ప్రతిజ్ఞ
లోక్‌సభ ఎన్నికలకు ముందు, బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో 'సంకల్ప్ పాత్ర' పేరుతో UNSCలో దేశానికి శాశ్వత సభ్యత్వం పొందాలని ప్రతిజ్ఞ చేసింది. ఏప్రిల్ 14న విడుదల చేసిన తన మేనిఫెస్టోలో, "ప్రపంచ నిర్ణయాధికారంలో భారతదేశ స్థానాన్ని పెంచేందుకు యుఎన్‌ఎస్‌సిలో శాశ్వత సభ్యత్వాన్ని సాధించడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని బిజెపి పేర్కొంది. జనవరిలో, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ UN భద్రతా మండలిలో భారతదేశం శాశ్వత సభ్యత్వానికి పెరుగుతున్న ప్రపంచ మద్దతును నొక్కిచెప్పారు.