America: బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. 6 వేలకుపైగా వీసాల రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
బర్త్ టూరిజం పేరుతో కేవలం తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లే విదేశీయులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఈ అక్రమ విధానాన్ని అరికట్టేందుకు ఇప్పటివరకు 6,000కు పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నవారు, వాటిని ప్రోత్సహించిన విదేశీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. బర్త్ టూరిజం కట్టడికి ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ చర్యలు కొనసాగుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమెరికా విదేశాంగ శాఖ చేసిన ట్వీట్
The Department of State’s Birth Tourism Prevention Task Force has now revoked more than 6,000 visas from foreigners who engaged in or facilitated birth tourism.
— Department of State (@StateDept) November 12, 2026
We are identifying and holding accountable everyone involved in this illicit practice. pic.twitter.com/u9f29iuJ8w
వివరాలు
చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు
ఈ అక్రమ విధానంలో భాగమైన ప్రతి ఒక్కరినీ గుర్తించి బాధ్యులను చేస్తామని హెచ్చరించింది.
అక్టోబర్ 31 నాటికి 4,000 వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించిన అధికారులు.. ఆ తర్వాత కేవలం 15 రోజుల్లోనే మరో 2,000 వీసాలను రద్దు చేయడం గమనార్హం.
గతంలో రద్దు చేసిన వీసాల్లో 700కు పైగా చైనా పౌరులకు చెందినవే ఉన్నాయి.
అయితే తాజా ప్రకటనలో ఏయే దేశాలకు చెందిన వారి వీసాలను రద్దు చేశారనే వివరాలను వెల్లడించలేదు.
ఈ సమస్యను అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం ఆగస్టు 12న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
అనంతరం సెప్టెంబర్ 23న విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొత్త వీసా ఆంక్షలను ప్రకటించారు.
వివరాలు
అమెరికాలో ప్రసవం కోసం ప్రయాణించడాన్ని నిరోధించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
వీటి ప్రకారం.. కేవలం అమెరికాలో ప్రసవించాలనే ఉద్దేశంతోనే ప్రయాణిస్తున్నారని కాన్సులర్ అధికారికి బలమైన అనుమానం కలిగితే, సదరు వ్యక్తికి 'బి నాన్-ఇమ్మిగ్రెంట్' వీసా జారీ చేయకుండా తిరస్కరించే అధికారం ఉంటుంది.
అంతేకాకుండా, ఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి అధికారులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
అయితే వీసా రద్దు చేయడం అనేది కేవలం పరిపాలనాపరమైన చర్య మాత్రమేనని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.
దీనివల్ల సదరు వ్యక్తిని దేశం నుంచి బహిష్కరించినట్లుగా లేదా అతడు ఏదైనా నేరానికి పాల్పడినట్లు నిర్ధారించినట్లుగా భావించకూడదని వివరించారు.
అలాగే, ఈ కొత్త నిబంధనల కారణంగా అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వం కల్పించే విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు.