US strikes: అమెరికా ప్రతీకార దాడులు.. సిరియా, ఇరాక్‌లోని ఇరాన్ మిలిటెంట్లపై బాంబుల వర్షం
సిరియా, ఇరాక్‌లోని ఇరాన్‌కు మద్దతుగా ఉన్న మిలీషియా స్థావరాలపై అమెరికా మిలిటరీ శుక్రవారం ప్రతీకార దాడులకు దిగింది. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ దాడికి ప్రతీకారంగా అగ్రరాజ్యం ప్రతీకార దాడులకు శ్రీకారం చుట్టింది. సిరియాలో అమెరికా వైమానిక దాడుల్లో ఆరుగురు మిలీషియా ఫైటర్లు మరణించారు. వారిలో ముగ్గురు నాన్ ఉన్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC), సిరియా, ఇరాక్‌లోని వారి మద్దతు ఉన్న మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేసింది. మొత్తం 85 కంటే ఎక్కువ లక్ష్యాలపై దీర్ఘ-శ్రేణి B-1 సూపర్సోనిక్‌తో అమెరికా మిలిటరీ బాంబుల వర్షం కురిపించింది. అమెరికా దాడులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.
85కి పైగా ప్రాంతాల్లో దాడులు
కేవలం 30 నిమిషాల వ్యవధిలో సిరియా, ఇరాక్‌లోని 7 ప్రాంతాల్లో 85కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యం తన ప్రకటనలో తెలిపింది. ఈ వైమానిక దాడుల్లో కమాండ్, కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ నిల్వ సౌకర్యాలతో పాటు లాజిస్టిక్స్, మందుగుండు సామగ్రి సరఫరా వ్యవస్థలను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో అనేక లక్ష్యాలు ధ్వంసమయ్యాయని అమెరికా సైనిక అధికారి తెలిపారు. యూఎస్ లెఫ్టినెంట్ జనరల్ డగ్లస్ సిమ్స్ మాట్లాడుతూ.. ఈ దాడులు విజయవంతమయ్యాయని, ఉగ్రవాదుల స్థావరాలపై బాంబులు పడిన వెంటనే, అనేక పేలుళ్లు సంభవించాయన్నారు.
మా జోలికొస్తే ఊరుకోం: అమెరికా అధ్యక్షుడు బైడెన్
ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లపై అమెరికా ఆర్మీ చేసిన వైమానిక దాడులపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. పశ్చిమాసియాలో తాము ఘర్షణలను కోరుకోవడం లేదన్నారు. అయితే, అమెరికన్లకు హాని కలిగిస్తే.. కచ్చితంగా ప్రతిచర్య ఇలాగే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, దాడులు ఇంతటితో ఆగవని బైడెన్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు ఉంటాయని ఆయన చెప్పారు. అమెరికా దాడులపై ఇరాక్ తీవ్రంగా స్పందించింది. ఇరాక్ సైనిక ప్రతినిధి యాహ్యా రసూల్ మాట్లాడుతూ.. ఈ వైమానిక దాడులు ఇరాక్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అన్నారు.
అమెరికా దాడి చేయడానికి కారణం ఇదే..
జనవరి 28న సిరియా-జోర్డాన్ సరిహద్దుల్లోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది, ఇరాన్‌తో సంబంధం ఉన్న తీవ్రవాద గ్రూపులే అని అమెరికా అనుమానించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తర్వాత పశ్చిమాసియాలో అమెరికా దళాలపై జరిగిన మొదటి ఘోరమైన దాడి ఇది. దాడి తర్వాత, ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా ప్రతిజ్ఞ చేసింది. ఈ క్రమంలో అందులో భాగంగనే శుక్రవారం ఇరాన్‌తో సంబంధం ఉన్న తీవ్రవాద గ్రూపుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.