Page Loader
Donald Trump: ట్రంప్‌ సర్కార్‌కు భారీ ఊరట.. 1,400 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ 
ట్రంప్‌ సర్కార్‌కు భారీ ఊరట.. 1,400 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్

Donald Trump: ట్రంప్‌ సర్కార్‌కు భారీ ఊరట.. 1,400 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తీవ్ర ఉత్కంఠ మధ్య అమెరికా సుప్రీం కోర్టులో డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. విద్యాశాఖను రద్దు చేసే ప్రక్రియ కొనసాగించవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో విద్యాశాఖకు చెందిన 1,400 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం నుంచే ట్రంప్‌ విద్యాశాఖను మూసివేయాలనే ఆలోచనతో ఉన్నారు. మార్చి 11న విద్యాశాఖలో సగానికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు కార్యదర్శి లిండా మెక్‌ మహోన్‌ ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా మార్చి 21న విద్యాశాఖను రద్దు చేయాలన్న ఆదేశాలపై ట్రంప్‌ సంతకం చేశారు.

వివరాలు 

మార్చి నుంచి మే మధ్యకాలంలో మొత్తం 1,400 మంది ఉద్యోగుల తొలగింపు 

అమెరికాలో నాలుగు దశాబ్దాలుగా విద్యా రంగంపై భారీగా ఖర్చు చేస్తున్నా అభివృద్ధి కనపడడం లేదని, యూరప్‌, చైనా దేశాల కంటే అమెరికా వెనుకబడిపోయిందని ట్రంప్‌ పేర్కొన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే విద్యార్థులకు ఫీజు రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. మార్చి నుంచి మే మధ్యకాలంలో మొత్తం 1,400 మంది ఉద్యోగులను తొలగించారు. ఇది మొత్తం ఉద్యోగుల్లో సగం. మిగతా సగాన్ని సెలవుల్లో ఉంచి, ఇతర విభాగాల్లో వారికి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా డెమోక్రట్స్‌తో పాటు మసాచుసెట్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ సిస్టమ్స్‌, యూనియన్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.

వివరాలు 

విద్యాశాఖ రద్దు ప్రక్రియ కొనసాగించవచ్చని 6-3 తేడాతో తీర్పు

మే 22న బోస్టన్‌ ఫెడరల్‌ కోర్టు ఉద్యోగుల తొలగింపును నిలిపివేయాలని ఆదేశించింది. తొలగించిన ఉద్యోగులను తిరిగి సేవల్లోకి తీసుకోవాలని జడ్జి యోంగ్‌ జోన్‌ స్పష్టం చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం బోస్టన్‌లోని యూఎస్‌ సర్క్యూట్‌ కోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా అనుకూలత దక్కలేదు. ఈ నేపథ్యంలో... జూలై 14న సుప్రీం కోర్టు కింది కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ, విద్యాశాఖ రద్దు ప్రక్రియ కొనసాగించవచ్చని 6-3 తేడాతో తీర్పునిచ్చింది. తీర్పు సమయంలో న్యాయమూర్తులు ఎలాంటి వివరణను వినిపించకపోవడం గమనార్హం. సుప్రీం తీర్పును విద్యాశాఖ కార్యదర్శి లిండా మెక్‌ మహోన్‌ స్వాగతించారు. అయితే ఈ తీర్పు రాజ్యాంగానికి ముప్పుగా మారవచ్చని, విద్యారంగానికి నష్టం వాటిల్లే ప్రమాదముందని ముగ్గురు న్యాయమూర్తులు హెచ్చరించారు.

వివరాలు 

లిండా.. తొలి, చివరి కార్యదర్శి? 

ట్రంప్‌ మళ్లీ అధ్యక్ష పదవిలోకి వచ్చాక మార్చి 3న డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈఓ లిండా మెక్‌ మహోన్‌ను విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. అదే రోజున ఆమె బాధ్యతలు స్వీకరించారు. విద్యాశాఖ రద్దు ఆదేశాలపై సంతకం చేస్తున్న సమయంలో లిండానే చివరి విద్యాశాఖ కార్యదర్శిగా ఉండే అవకాశం ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఎందుకీ నిర్ణయమంటే.. 

అమెరికాలో 1979 నుంచి విద్యాశాఖను ఫెడరల్‌ ప్రభుత్వం నిర్వహిస్తోంది. పాలనాపరంగా ఈ శాఖ పాత్ర పరిమితమైనదే అయినా, నిధుల విషయంలో భారీ ఖర్చులు వస్తున్నాయి. అందుకే విద్యాశాఖను రద్దు చేయాలని ట్రంప్‌ భావించారు. ఎన్నికల సమయంలోనూ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తానని వాగ్దానం చేశారు. ఇకపై రాష్ట్రాలు తమ తరహాలో విద్యా నిర్వహణ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ట్రంప్‌ నిర్ణయంపై డెమోక్రట్లు, విద్యావేత్తలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికా విద్యావ్యవస్థకు భారీ నష్టం చేస్తుందని, మరో వినాశకార నిర్ణయమని డెమోక్రటిక్‌ సెనేటర్‌ చుక్‌ షూమర్‌ అన్నారు.