Venezuela Oil: మార్కెట్ ధరకే వెనిజులా నుంచి అమెరికాకు 50 మిలియన్ బ్యారెళ్ల చమురు: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
వెనెజువెలా చమురుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా నుంచి 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల వరకు చమురును అమెరికాకు అప్పగించే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చమురు విక్రయం ద్వారా వచ్చే మొత్తం ఆదాయం పూర్తిగా తన నియంత్రణలోనే ఉంటుందని ట్రంప్ 'ట్రూత్ సోషల్' వేదికగా స్పష్టం చేశారు. వెనెజువెలాపై సైనిక చర్యలు చేపట్టి,అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న కొన్ని రోజులకే ఈ ప్రకటన వెలువడడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వెనెజువెలాలో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక పాలకులు అత్యుత్తమ నాణ్యత కలిగిన 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికాకు అప్పగించనున్నట్లు ట్రంప్ తెలిపారు.
వివరాలు
చమురు అప్పగింత ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుంది: ట్రంప్
ఈ నిర్ణయం ప్రకటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆ చమురును మార్కెట్ ధరలకే విక్రయించనున్నట్లు వెల్లడించిన ట్రంప్, దాని ద్వారా వచ్చే నిధులు తన ఆధీనంలోనే ఉంటాయని చెప్పారు. ఆ మొత్తాన్ని అమెరికా ప్రజలతో పాటు వెనెజువెలా ప్రజల ప్రయోజనాల కోసం వినియోగిస్తామని తెలిపారు. చమురు అప్పగింత ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ వెల్లడించారు.
వివరాలు
వెనెజువెలా చమురు రంగ సంస్థలతో వైట్ హౌస్ కీలక సమావేశం
వెనెజువెలా నుంచి చమురును నౌకల ద్వారా రవాణా చేసి, నేరుగా అమెరికా ఓడరేవుల్లో దింపేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, వెనెజువెలాకు చెందిన చమురు రంగ సంస్థలతో వైట్ హౌస్ శుక్రవారం కీలక సమావేశం నిర్వహించనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఓవల్ ఆఫీస్‌లో జరగనున్న ఈ సమావేశానికి ఎక్సాన్, చెవ్రాన్, కోనోకోఫిలిప్స్ వంటి ప్రముఖ చమురు కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నట్లు సమాచారం.