
Trump- Zelensky: అమెరికాతో ఖనిజాల ఒప్పందం దిశగా తొలి అడుగు.. ప్రకటించిన ఉక్రెయిన్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకేందుకు తాము ముందుకొస్తామని, అందుకు బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతి ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా ప్రతిపాదించిన విషయం విదితమే.
ఈ వ్యవహారంలో తాజాగా కీలక ముందడుగు పడింది. ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకారం, అమెరికాతో తొలి ఒప్పందానికి బాటలు వేసినట్లు స్పష్టం చేసింది.
ఈ క్రమంలో కీవ్, వాషింగ్టన్ మద్య మెమోరాండం ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు జరిగినట్లు ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి యులియా స్విరిడెంకో తెలిపారు.
వివరాలు
కోత్త పెట్టుబడులు, ఆర్థిక అవకాశాలు
''మా అమెరికన్ భాగస్వాములతో మెమోరాండం ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేసిన విషయాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యం బలోపేతమవుతుంది. ఉక్రెయిన్ పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యాపార రంగానికి తోడ్పాటు, అలాగే కొత్త పెట్టుబడులు, ఆర్థిక అవకాశాలకు ఇది దోహదపడనుంది'' అని తెలిపారు.
ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. అమెరికాకు కీలక ఖనిజాలు, సహజ వనరులు అందుబాటులోకి రావడానికి ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
500 బిలియన్ డాలర్ల విలువైన డీల్
ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అరుదైన ఖనిజాల ఒప్పందం చేయాలని సూచించారు.
అంతేకాదు, సహజ వనరులు, మౌలిక సదుపాయాలపై ఆధిపత్యం కల్పించాలని కోరారు.
అయితే, మొదట్లో ఉక్రెయిన్ ఈ ప్రతిపాదనను అంగీకరించకపోవడంతో, అమెరికా సైనిక సహాయం నిలిపివేసింది. జెలెన్‌స్కీ వ్యవహారశైలి పట్ల ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇప్పుడు,కొన్ని సవరణలతో ఆ ఒప్పందం అంగీకరించబడినట్లు సమాచారం.దీంతో అమెరికా నుంచి సైనిక సహాయం కొనసాగనుందని ఉక్రెయిన్ భావిస్తోంది.
ట్రంప్ గతంలో ఈ ఒప్పందంపై మాట్లాడుతూ, ఉక్రెయిన్‌కు 500 బిలియన్ డాలర్ల విలువైన డీల్‌ను ప్రతిపాదించామన్నారు.
దీనికి జెలెన్‌స్కీ కూడా ఆమోదం తెలిపారని చెప్పారు. ఖనిజాలు తమకు లభిస్తే, ఉక్రెయిన్‌కు అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపారు.
వివరాలు
ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందంపై ఉక్రెయిన్ సంతకాలు
అయితే, వాషింగ్టన్ ఇచ్చింది 100 బిలియన్ డాలర్లే కదా, అలాంటప్పుడు 500 బిలియన్ డాలర్ల ఒప్పందం ఎందుకు అడుగుతారు అంటూ జెలెన్‌స్కీ అప్పట్లో కౌంటర్ ఇచ్చారు.
అయినప్పటికీ, ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందంపై ఉక్రెయిన్ అధికారికంగా సంతకాలు చేసిన విషయం విశేషంగా చెప్పుకోవాలి.