USA: అమెరికా ఇమిగ్రేషన్ కస్టడీలో 1,389 మంది భారతీయ చిన్నారులు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసల నియంత్రణపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని గుర్తించి, తిరిగి వారి స్వదేశాలకు పంపిస్తోంది. ఈ చర్యల్లో భాగంగా పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఇమిగ్రేషన్ అధికారుల కస్టడీలోకి వెళ్తున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు మొత్తం 1,389 మంది ఒంటరి భారతీయ చిన్నారులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తాజాగా వెల్లడైంది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (USCBP) విభాగం విడుదల చేసిన తాజా నివేదికల్లో ఈ వివరాలు ఉన్నాయి. వీరిలో చాలామంది అమెరికా సరిహద్దుల్లో తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు కాగా, మరికొందరు అనాథలుగా మారిన చిన్నారులు.
వివరాలు
2026 అక్టోబర్ వరకు అదుపులోకి 722 మంది చిన్నారులు
తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తోడుగా లేకుండా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పిల్లలను అధికారులు 'అన్‌అకంపెనీడ్ చిల్డ్రన్' (Unaccompanied Children)గా పరిగణిస్తారు.
ఈ తరహాలో అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల కస్టడీలోకి వచ్చిన చిన్నారుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 1.1 లక్షలకు చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఇక 2026 అక్టోబర్ వరకు 722 మంది చిన్నారులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే అమెరికాలో వీసా నిబంధనలు కఠినతరం కావడం, అక్రమ వలసదారులపై దేశ బహిష్కరణ చర్యలు పెరగడంతో ఒంటరిగా వస్తున్న భారతీయ చిన్నారుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
గ్రీన్‌కార్డు పొందాలనే ఉద్దేశంతో..
గతంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను అమెరికాలో చట్టబద్ధమైన నివాస హోదా పొందేందుకు ఉపయోగించుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యంగా గ్రీన్‌కార్డు పొందాలనే ఉద్దేశంతో చిన్నారులను ముందుగా అమెరికాకు పంపేవారని చెబుతున్నారు.
అయితే అక్రమంగా సరిహద్దులు దాటే సమయంలో ఇమిగ్రేషన్ అధికారులకు పట్టుబడతామనే భయంతో కొందరు తల్లిదండ్రులు పిల్లలను అక్కడే వదిలేసి పారిపోయేవారని అధికారులు పేర్కొన్నారు.
ఇలా సరిహద్దుల్లో ఒంటరిగా మిగిలిపోయిన చిన్నారులను ఇమిగ్రేషన్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు.
అనంతరం ప్రత్యేక ఇమిగ్రేషన్ కేంద్రాల్లో వారికి వసతి కల్పించి, అవసరమైన సంరక్షణ అందిస్తున్నారు.
ప్రస్తుతం ఇలాంటి ఘటనలు గతంతో పోలిస్తే తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.