గల్లంతైన సబ్ మెరైన్ కోసం సముద్ర గర్భంలోకి దిగిన ఫ్రెంచ్ విక్టర్-6000 రోబో
అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన సబ్ మెరైన్ ను గుర్తించేందుకు విక్టర్-6000 రంగంలోకి దిగింది. దశాబ్దాల కిందట సముద్రం గర్బంలో కలిసిపోయిన టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ కనుమరుగైపోయింది. గత 3 రోజులుగా ముమ్ముర గాలింపులు చేస్తున్నప్పటికీ కనీస ఆధారాలు ఇప్పటి వరకు దొరకకపోవడం కలవరపరుస్తోంది. ఓషన్ గేట్ టైటాన్ సబ్ మెరైన్ లో పలువురు ప్రపంచ కుబేరులు ఉండటం తీవ్ర విచారం నెలకొంది. మినీ జలాంతర్గామిలోని ఆక్సిజన్ ప్రాణవాయువు నేటి సాయంత్రం 7.15 గంటల వరకే సరిపోతుందని నిపుణులు తేల్చారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను వేగవంతం చేశారు.
విక్టర్-6000 జలంతర్గామిని గుర్తించినా బయటకు స్వయంగా తీసుకురాలేదు
తాజాగా టైటాన్ ఆచూకీ కనిపెట్టేందుకు ఫ్రాన్స్ కు చెందిన విక్టర్-6000 అనే అత్యాధునిక ఆక్వాటిక్ రోబోను ప్రయోగిస్తున్నారు. 4.5 టన్నుల బరువు కలిగి ఉన్న ఈ భారీ రోబో, మహాసముద్రంలో దాదాపు 20 వేల అడుగుల కింది వరకు దూసుకెళ్లగలదు. గల్లంతైన సబ్ మెరైన్ కంటే ఇది మరింత లోతులోనూ ప్రయాణం చేయగలదు. ఫ్రెంచ్ రోబో, జలంతర్గామిని గుర్తించినప్పటికీ, స్వయంగా దాన్ని బయటకు తీసుకువచ్చే శక్తి లేదు. మునిగిన సబ్ మెరైన్ కు కొన్ని కేబుల్స్ ను జత చేసి వాటి ద్వారా ఉపరితలంపైకి లాక్కొస్తుంది. ఉపరితలంపై ఉన్న భారీ యంత్రాల ద్వారా జలాంతర్గామిని బయటికి రప్పిస్తారు. ఈ విక్టర్-6000 రోబోకి ఏకధాటిగా 3 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేసే సామర్థ్యం ఉంది.