
Indian student: అమెరికాలో వీసా రద్దు కలకలం.. భారత విద్యార్థికి కోర్టులో ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వలస విధానాలు అక్కడ నివసిస్తున్న విదేశీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో విద్యార్థులకు తమ వీసాలు రద్దైన విషయమే తెలియకుండానే గడిచిపోతుంది. ఇలాంటి పరిణామంలో ఒక భారతీయ విద్యార్థి వీసా రద్దయ్యింది.
అయితే అతడికి ఫెడరల్ కోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. 21 ఏళ్ల భారతీయ విద్యార్థి క్రిష్‌లాల్ ఐసర్‌దాసానీ, విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు.
మే నెలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోనున్న తరుణంలో ఏప్రిల్ 4న అతని ఎఫ్-1 వీసాను రద్దు చేశారు. స్టూడెంట్ అండ్ ఎక్చేంజ్ విజిటర్స్ ప్రోగ్రామ్ డేటాబేస్ నుంచి అతడి వివరాలు తొలగించారు.
Details
తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించాలి
దీనిపై ఆందోళనకు లోనైన క్రిష్‌లాల్, తక్షణమే స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి ట్రంప్ ప్రభుత్వ చర్యను తప్పుపట్టారు.
వీసా రద్దు చేయడానికి ముందు విద్యార్థికి ఎలాంటి హెచ్చరిక ఇవ్వలేదు. వివరణ ఇవ్వడానికి లేదా తప్పు సరిదిద్దుకునేందుకు కూడా అవకాశం కల్పించలేదని వ్యాఖ్యానించారు.
వీసా రద్దు చేయకుండా, విద్యార్థిని బహిష్కరించకుండా ఉండాలని హోంలాండ్ సెక్యూరిటీ శాఖను ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎఫ్-1 వీసా అనేది నాన్-ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అమెరికాలో పూర్తి స్థాయి విద్యను అభ్యసించేందుకు ఇది అవకాశాన్ని కల్పిస్తుంది.
ప్రతి సంవత్సరం రెండు సెషన్లలో ప్రవేశాలు ఇచ్చే అమెరికా విద్యా సంస్థల్లో ముఖ్యంగా ఆగస్టు-డిసెంబర్ సెమిస్టర్ సమయంలో భారతీయ విద్యార్థుల ప్రవేశం ఎక్కువగా ఉంటుంది.