
Donald Trump: భారత్‌పై మరోసారి బురద జల్లిన ట్రంప్.. టారిఫ్‌ల వేళ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్‌పై విమర్శలు గుప్పించారు. అమెరికా-భారత్ సంబంధాలు సాధారణంగా సత్సంబంధాల్లాగానే ఉన్నప్పటికీ, న్యూఢిల్లీ అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధించడం వల్ల ఇరుదేశాల సంబంధం గత కొన్నేళ్లుగా సమతుల్యం కోల్పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. వైట్ హౌస్‌లో మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చిన ట్రంప్, "భారత్‌పై విధించిన కొన్ని సుంకాలను తొలగించే ఆలోచన ఉందా?" అన్న ప్రశ్నకు స్పందిస్తూ, "అమెరికా-భారత్ సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ చాలా కాలంగా ఆ సంబంధం ఏకపక్షంగా కొనసాగింది. నేను పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాతే ఆ పరిస్థితి మారడం ప్రారంభమైంది" అని తెలిపారు.
వివరాలు
అమెరికా భారత్‌తో పెద్ద ఎత్తున వ్యాపారం చేయడం లేదు: ట్రంప్
భారత్ అమెరికా నుండి విపరీతమైన సుంకాలు వసూలు చేస్తోందని, అవి ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. అందువల్లే అమెరికా భారత్‌తో పెద్ద ఎత్తున వ్యాపారం చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికా మాత్రం భారత్‌పై ఇలాంటి భారీసుంకాలు విధించడం లేదని, అందుకే భారతదేశం యూఎస్ మార్కెట్‌లో తమ ఉత్పత్తులను సులభంగా విక్రయించగలుగుతోందని ట్రంప్ ఎద్దేవా చేశారు. "వారు మాదిరిగా మేము మూర్ఖంగా సుంకాలు వసూలు చేయడం లేదు" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
వివరాలు
భారత్ తమపై 100 శాతం సుంకం విధిస్తోంది: ట్రంప్
ఇక భారత్‌లో లభ్యం కాని కొన్ని ఉత్పత్తులను అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, భారత్ తమపై 100 శాతం సుంకం విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు. దీనికి ఉదాహరణగా హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లను ప్రస్తావించారు. ఆ మోటార్ సైకిళ్లపై 200 శాతం సుంకం ఉన్నందున భారత మార్కెట్లో వాటి విక్రయాలు అసాధ్యం అయిపోయాయని పేర్కొన్నారు. అయితే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హార్లే డేవిడ్సన్ భారతదేశంలోనే మోటార్ సైకిల్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిందని, అందువల్ల ఇప్పుడు వారికి అమెరికా తరహా సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.