
China:'బెదిరింపు ప్రవర్తన అంగీకరించం'.. ప్రపంచ నేతల ముందు ట్రంప్‌పై జిన్‌పింగ్ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
చైనా (China)లోని తియాన్‌జిన్ వేదికగా షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీవో) ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) కీలక ప్రసంగం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ సమాజంలో 'బెదిరింపు ధోరణిని తాము అంగీకరించబోమని' స్పష్టం చేశారు. జిన్‌పింగ్ మాట్లాడుతూ ప్రపంచ పరిస్థితులు ఇంకా అస్థిరంగా, అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో బయటి జోక్యం, బెదిరింపులను అంగీకరించరాదు. ప్రతి దేశం చట్టబద్ధ అభివృద్ధి హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా మధ్య, దక్షిణ, తూర్పు ఆసియా దేశాలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.
Details
అంతర్జాతీయ వ్యవహారాలు గౌరవం ఆధారంగానే నడవాలి
జిన్‌పింగ్ తన ప్రసంగంలో బహుళత్వం, న్యాయం, నిష్పాక్షికతకు ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కిచెప్పారు. ప్రపంచ వాణిజ్య వ్యవస్థ, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని సూచించారు. ఆధిపత్యం, దురహంకార రాజకీయాలు అంగీకారానికి నోచుకోవు. అంతర్జాతీయ వ్యవహారాలు పరస్పర గౌరవం ఆధారంగానే నడవాలని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఎస్‌సీవో సభ్యులందరూ స్నేహపూర్వక సహకారంతో ముందుకుసాగాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. సాంస్కృతిక వైవిధ్యాలను గౌరవించుకుంటూ, సామరస్యంతో ముందుకు వెళితే అన్ని దేశాల శ్రేయస్సు సాధ్యమవుతుందని అన్నారు.
Details
భారత్ పై 50శాతం సుంకాలు
ఆర్థిక సహకారం పరంగా, జిన్‌పింగ్ ఈ ఏడాదిలోనే షాంఘై సహకార సదస్సు సభ్యులకు 2 బిలియన్ యువాన్లు (దాదాపు 281 మిలియన్ డాలర్లు) అందజేస్తామని ప్రకటించారు. ఇక మరోవైపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారత్ సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధించారు. భారత్‌పై 50 శాతం సుంకాలు విధించగా, చైనాకు మాత్రం 90 రోజుల మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం సుంకాల అంశంపై బీజింగ్-వాషింగ్టన్ చర్చలు కొనసాగుతున్నాయి. వాణిజ్య ఒప్పందం సాధించే దిశగా ఇరుదేశాలు మంతనాలు జరుపుతున్నాయి. అయితే అమెరికాకు ఎగుమతయ్యే అరుదైన అయస్కాంతాలపై అడ్డంకులు పెడితే 200 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ మరోసారి హెచ్చరించారు.