Loading...
Myanmar: రఖైన్‌లో పరిస్థితులు చక్కబడితే.. 3 లక్షల రోహింగ్యాలను వెనక్కి తీసుకుంటాం: మయన్మార్
రఖైన్‌లో పరిస్థితులు చక్కబడితే.. 3 లక్షల రోహింగ్యాలను వెనక్కి తీసుకుంటాం: మయన్మార్

Myanmar: రఖైన్‌లో పరిస్థితులు చక్కబడితే.. 3 లక్షల రోహింగ్యాలను వెనక్కి తీసుకుంటాం: మయన్మార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల్లో ఉంటున్న 3 లక్షలకుపైగా రోహింగ్యాలు మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రానికి చెందిన మాజీ నివాసితులేనని గుర్తించామని ఆ దేశ సైనిక మద్దతు ఉన్న ప్రభుత్వం వెల్లడించింది. అయితే రఖైన్‌లో భద్రతా పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే వారిని తిరిగి స్వీకరిస్తామని స్పష్టం చేసింది. రోహింగ్యా శరణార్థుల సంక్షోభం తొమ్మిదో సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో మయన్మార్‌ ఈ ప్రకటన చేసింది. 2017 ఆగస్టులో చోటుచేసుకున్న హింస తర్వాత లక్షలాది మంది రోహింగ్యాలు మయన్మార్‌ నుంచి పారిపోయి బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలకు చేరుకున్నారు. బంగ్లాదేశ్‌ అందించిన జాబితాలోని 8,28,824 మంది శరణార్థుల్లో 4,26,545 మందిని జులై చివరి నాటికి ధ్రువీకరించినట్లు మయన్మార్‌ తెలిపింది.

వివరాలు

2017లో భారీగా వలస

వారిలో 3,08,797 మంది రఖైన్‌ రాష్ట్రానికి చెందిన మాజీ నివాసితులని గుర్తించినట్లు పేర్కొంది. భద్రతా పరిస్థితులు స్థిరపడిన తర్వాత ధ్రువీకరించిన మాజీ నివాసితులను తిరిగి స్వీకరించేందుకు బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించింది.

2017లో రఖైన్‌లో రోహింగ్యా తిరుగుబాటు సంస్థ భద్రతా పోస్టులపై దాడులు చేసిన అనంతరం మయన్మార్‌ సైన్యం భారీ స్థాయిలో ఆపరేషన్‌ చేపట్టింది.

ఆ తర్వాత 7 లక్షల మందికి పైగా రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు పారిపోయారు. అంతకుముందే మయన్మార్‌ సైన్యం చేపట్టిన వివిధ హింసాత్మక చర్యల కారణంగా లక్షలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందారు.

ఈ ఆపరేషన్‌ తీవ్రత, భారీ స్థాయి కారణంగా అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి నుంచి మయన్మార్‌పై జాతి నిర్మూలన, మారణహోమం ఆరోపణలొచ్చాయి.

వివరాలు

రోహింగ్యాలను గుర్తించని మయన్మార్

మయన్మార్‌ తమ దేశంలోని 135 అధికారిక జాతి సమూహాల్లో రోహింగ్యాలను గుర్తించదు.

వారిని 'బెంగాలీలు'గా పేర్కొంటూ.. వారు బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వచ్చినవారనే వాదనను కొనసాగిస్తోంది.

తాజా ప్రకటనలో 1,13,507 మందిని ధ్రువీకరించలేకపోయామని మయన్మార్‌ విదేశాంగ శాఖ తెలిపింది. మరో 4,241 మంది ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.

అదే సమయంలో రఖైన్‌ నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారన్న వాదనలను కూడా మయన్మార్‌ తోసిపుచ్చింది.

2017 హింస తర్వాత 5.4 లక్షల మందికి పైగా బంగ్లాదేశ్‌కు వెళ్లారని, మరో 2 లక్షల మందికి పైగా ఉత్తర రఖైన్‌లోనే ఉండిపోయారని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

2018లో ఒప్పందం.. కానీ తిరిగి పంపడం సాధ్యం కాలేదు

రోహింగ్యాల పునరావాసం కోసం మయన్మార్‌, బంగ్లాదేశ్‌ 2018లో రెండేళ్ల ప్రక్రియకు అంగీకరించాయి.

అయితే 2021లో మయన్మార్‌ సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుని, ఎన్నికైన ప్రభుత్వం, ఆంగ్‌ సాన్‌ సూకీని తొలగించిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి.

దేశవ్యాప్తంగా సాయుధ ప్రతిఘటన మొదలవడంతో శరణార్థుల పునరావాస ప్రయత్నాలు ముందుకు సాగలేదు.

2023లో రఖైన్‌లోని అరకాన్‌ ఆర్మీ, మయన్మార్‌ సైన్యం మధ్య పోరు మళ్లీ తీవ్రతరం కావడంతో మరింత మంది ప్రజలు బంగ్లాదేశ్‌, ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.

ఇటీవలి కాలంలో అరకాన్‌ ఆర్మీ మయన్మార్‌ సైన్యం నుంచి అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుని రఖైన్‌లోని పెద్ద భాగంపై నియంత్రణ సాధించింది.

ADVERTISEMENT

వివరాలు

శిబిరాల్లో దుర్భర పరిస్థితులు

బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల్లో పరిస్థితులు కూడా దారుణంగా మారుతున్నాయి.

విదేశీ సాయం భారీగా తగ్గడం, తిరిగి వెళ్లేందుకు సురక్షితమైన పరిస్థితులు లేకపోవడంతో కొందరు రోహింగ్యాలు ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలకు తసిద్ధమవుతున్నారు.

చిన్నపాటి పడవల్లో మలేసియా, ఇండోనేషియా వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం.. తమ దేశంలోని 5,000 మంది రోహింగ్యాలను మయన్మార్‌ తిరిగి తీసుకునేందుకు అంగీకరించిందని చెప్పారు.

వివరాలు

ఆ వార్తలను ఖండిస్తూ ప్రకటన

అయితే మయన్మార్‌ విదేశాంగ శాఖ అధికారి హాన్‌ విన్‌ ఆంగ్‌ దీనిపై వివరణ ఇస్తూ.. ఆ కార్యక్రమం మలేసియాలోని నిర్బంధ కేంద్రాల్లో ఉన్న ధ్రువీకరించిన మయన్మార్‌ జాతీయులకు మాత్రమే పరిమితమని, రోహింగ్యాలను స్వీకరిస్తారన్న వార్తలను ఖండించారు

మొత్తంగా ధ్రువీకరించిన మాజీ రఖైన్‌ నివాసితులను తిరిగి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మయన్మార్‌ మరోసారి స్పష్టం చేసింది.

అయితే రఖైన్‌లో భద్రతా పరిస్థితులు మెరుగుపడటమే పునరావాసానికి ప్రధాన షరతు అని తేల్చిచెప్పింది.

ADVERTISEMENT