US-Iran Talks: ఇరాన్‌కు చెందిన 100 బిలియన్ డాలర్ల స్తంభింపజేసిన ఆస్తులు ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధ పరిస్థితులకు ముగింపు పలకడానికి తమ పది షరతులను అంగీకరించాలని ఇప్పటికే ఇరాన్ స్పష్టం చేసింది. వాటిలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ ఉంది. రాబోయే చర్చల్లో ఇదే అంశంపై టెహ్రాన్ గట్టిగా నిలబడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ఆస్తులను నిలిపివేయడం ఎప్పుడు మొదలైందనే ప్రశ్నకు చరిత్రలోకి వెళ్లాలి. 1979లో ఇస్లామిక్ విప్లవం సమయంలో ఇరాన్‌లో భారీ నిరసనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో 50 మందికి పైగా అమెరికా రాయబారి కార్యాలయ సిబ్బంది, పౌరులను బందీలుగా తీసుకున్నారు.
వివరాలు
ఆర్థిక అస్థిరతే ప్రధాన కారణంగా నిరసనలు
వారిని 444 రోజుల పాటు నిర్బంధంలో ఉంచారు. దీనికి ప్రతిగా అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్(Jimmy Carter) తీవ్రంగా స్పందించి, ఇరాన్ ఆస్తులను నిలిపివేసి బందీల విడుదల కోసం ఒత్తిడి తెచ్చారు. ఆ తరువాత అణు కార్యక్రమాలు, క్షిపణి అభివృద్ధి వంటి కారణాలతో ఇరాన్‌పై ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. ఈ ఆంక్షల ప్రభావంతో చమురు, ఇతర ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇరాన్ పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై, ప్రజల జీవన విధానం కూడా దెబ్బతింది. ఇటీవలి కాలంలో అక్కడ జరిగిన నిరసనలకు ఆర్థిక అస్థిరతే ప్రధాన కారణంగా నిలిచింది.
వివరాలు
ఇరాన్‌తో పాటు ఆంక్షలు ఎదుర్కొంటున్న ఈ దేశాలు
ఆస్తులను నిలిపివేయడం అంటే ఒక దేశం లేదా సంస్థకు చెందిన ఆస్తులను తాత్కాలికంగా వినియోగం చేయకుండా నిరోధించడం. ఇది కోర్టులు, అంతర్జాతీయ సంస్థలు లేదా బ్యాంకింగ్ వ్యవస్థల ద్వారా అమలు చేయబడుతుంది. మనీలాండరింగ్, నేరాలు లేదా అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనల కారణంగా ఈ చర్యలు తీసుకుంటారు. ఇలాంటి ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల్లో ఇరాన్‌తో పాటు రష్యా, చైనా, ఉత్తర కొరియా, వెనెజువెలా, లిబియా, క్యూబా ఉన్నాయి. ఇరాన్ ఆస్తులు ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్నాయి. అమెరికా, చైనా, జపాన్, ఇరాక్, ఐరోపా దేశాల్లో ఇవి నిలిపివేయబడ్డాయి. మొత్తం విలువపై స్పష్టత లేకపోయినా, కొన్ని అంచనాల ప్రకారం ఈ మొత్తం సుమారు 100 బిలియన్ డాలర్లకు పైగా ఉండొచ్చని భావిస్తున్నారు.
వివరాలు
అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ
దేశాల వారీగా చూస్తే, జపాన్ వద్ద సుమారు 1.5 బిలియన్ డాలర్లు, చైనా వద్ద 20 బిలియన్ డాలర్లు, భారత్ వద్ద 7 బిలియన్ డాలర్లు, ఇరాక్ వద్ద 6 బిలియన్ డాలర్లు, అమెరికా,ఐరోపాలో కలిపి 3.6 బిలియన్ డాలర్ల మేర ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఖతార్‌లో ఉన్న 6 బిలియన్ డాలర్లను ఇరాన్‌కు చెల్లించేందుకు దక్షిణ కొరియాకు తరలించినప్పటికీ, అక్కడ కూడా అమెరికా వాటిని నిలిపివేసింది. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకారం కుదిరి, పాకిస్థాన్‌లో చర్చలు జరిగాయి.
వివరాలు
తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్‌కు ఆస్తులు విడుదలైతే భారీ ఉపశమనం
అయితే ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ సమయంలో కొన్ని ఆస్తులను విడుదల చేయడానికి అమెరికా అంగీకరించిందనే వార్తలు వచ్చినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్ వాటిని ఖండించింది. ప్రస్తుతం ఆంక్షలు,యుద్ధ ప్రభావంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్‌కు ఈ ఆస్తులు విడుదలైతే భారీ ఉపశమనం లభించే అవకాశం ఉంది. అందుకే రాబోయే చర్చల్లో ఈ అంశం ప్రధానంగా నిలవడం ఖాయమని భావిస్తున్నారు.