రష్యాలో ఏం జరుగుతోంది? వాగ్నర్ గ్రూప్ పుతిన్‌పై ఎందుకు తిరుగుబాటు చేసింది? తర్వాత ఎందుకు వెనక్కి తగ్గింది?
గత రెండు రోజులుగా రష్యాలో హైడ్రామా నడిచింది. పుతిన్ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ రష్యాలో తిరుగుబాటుకు దిగారు. కీలక ప్రాంతాలను కూడా ఆక్రమించారు. అనూహ్యంగా ఒక్కరోజులోనే బెలారస్ మధ్యవర్తిత్వంతో తిరుగుబాటుకు ప్రిగోజిన్ తెరదింపారు. వాగ్నర్ గ్రూప్ అంటే ఏంటీ? వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రిగోజిన్ తన మిత్రుడిపై ఎందుకు తిరుగుబావుటా ఎగరేశారు? ఉక్రెయిన్‌పై యుద్ధంలో పుతిన్ తరఫున విరోచితంగా పోరాడుతున్న వాగ్నర్ గ్రూప్‌ను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చిన్నచూపు చూసిందా? రష్యా- ప్రిగోజిన్ మధ్య కుదిరిన మధ్యవర్తిత్వం ఏంటి? అసలు ఇంతకీ రష్యాలో జరుగుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.
వాగ్నర్ గ్రూప్ అంటే ఏమిటి?
వాగ్నర్ గ్రూప్ అనేది ఒక ప్రైవేట్ మిలిటరీ కంపెనీ. దీనికి చీఫ్‌గా రష్యా అధ్యక్షుడు పుతిన్ అత్యంత సన్నిహితుడు ప్రిగోజిన్ ఉన్నారు. ఈ గ్రూప్ ప్రధానంగా పుతిన్ సైనిక లక్ష్యాలను నెరవేర్చేందుకు పని చేస్తుంది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో కూడా ఈ గ్రూప్ పుతిన్‌కు మద్దతుగా వీరోచితంగా పోరాడుతోంది. వాగ్నర్ గ్రూప్ అనేక ఖండాల్లో పుతిన్ నిర్దేశించిన పనులను పూర్తి చేసింది. ఈ క్రమంలో వాగ్నర్ గ్రూప్ వివిధ దేశాల్లో యుద్ధ నేరాల ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఆఫ్రికా దేశాల్లోని అనే వివాదాల్లో ఈ గ్రూప్ హస్తం ఉన్నట్లు అమెరికా, యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి చెబుతున్నాయి. ఉక్రెయిన్‌లో 50,000మంది వాగ్నర్ గ్రూప్‌కు ప్రిగోజిన్ నాయకత్వం వహించినట్లు యూకే రక్షణ మంత్రిత్వ తెలిపింది.
రష్యాపై వాగ్నర్ గ్రూప్ ఎందుకు తిరుగుబాటు చేసింది?
ఉక్రెయిన్‌లో రష్యా మద్దతుగా వాగ్నర్ గ్రూప్ యుద్ధం చేస్తోంది. వాగ్నర్ గ్రూప్ ఉక్రెయిన్‌పై యుద్ధంలో అనతికాలంలోనే ఆ దేశానికి కీలకమైన బఖ్‌ముట్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో ప్రిగోజిన్‌కు విశేష గుర్తింపును పొందాడు. ప్రిగోజిన్ ఒక్కసారిగా హీరో అయ్యాడు. నేపథ్యంలో ఈర్ష్యతోనే రష్యా సైన్యం తన దళాలకు ఉక్రెయిన్‌పై పోరాడటానికి అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఇవ్వడం లేదని ఆరోపించాడు. రష్యా సైన్యం వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో తన యోధులను హతమార్చిందని వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ ఆరోపించారు. పుతిన్- ప్రిగోజిన్ మధ్య ఒకప్పుడు సన్నిహిత సంబంధాలు ఉండగా, ఇటీవల కాలంలో అవి దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ప్రిగోజిన్ సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చారు.
రాత్రికి రాత్రే రష్యాపై తిరుగుబాటును ప్రకటించిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్
వాగ్నర్ గ్రూప్ శుక్రవారం రాత్రి కీలకమైన దక్షిణ రష్యా నగరమైన రోస్తావ్-ఆన్-డాన్‌లోని అన్ని సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా తాము తిరుగుబాటు చేస్తున్నట్లు ప్రిగోజిన్ ప్రకటించారు. రోస్తావ్-ఆన్-డాన్‌లోని మిలిటరీ జిల్లా ప్రధాన కార్యాలయాన్ని ఆక్రమించుకున్న తర్వాత రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్‌లను తనకు అప్పగించాలని లేదా తన సైనికులను మాస్కోకు తరలించాలని ప్రిగోజిన్ డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో అప్రమత్తమైన రష్యా యంత్రాంగం ప్రిగోజిన్‌పై ఆంక్షలు విధించింది. అతనిపై కేసులు నమోదు చేసింది. మాస్కోలో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను ఏర్పాటు చేశారు. రాజధానికి వెళ్లే అన్ని రోడ్లను బ్లాక్ చేశారు. ఈ క్రమంలో ప్రిగోజిన్‌ను పుతిన్ వెన్నుపోటుదారుగా అభివర్ణించారు.
బెలారస్ మధ్యవర్తిత్వంతో 24గంటల్లోనే తిరుగుబాటును ఆపేసిన ప్రిగోజిన్
తిరుగుబాటు ప్రకటించిన సరిగ్గా 24గంటల తర్వాత రష్యాతో ప్రిగోజిన్ రాజీకి వచ్చారు. పుతిన్ మిత్రుడు, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వంతో ప్రిగోజిన్ తన తిరుగుబాటును ఆపేశారు. ఈ క్రమంలో ప్రిగోజిన్ కొన్ని షరతులకు రష్యా అంగీకరించింది. దీంతో ప్రిగోజిన్ ఆయుధాలను వదిలి బెలారస్‌కు వెళ్లినట్లు రష్యా వర్గాలు తెలిపాయి. ప్రిగోజిన్ తిరుగుబాటును ఆపిన నేపథ్యంలో అతనిపై ఉన్న క్రిమినల్ కేసులను రష్యా రద్దు చేసింది. అలాగే తిరుగుబాటులో పాల్గొన్న వాగ్నర్ సైనికులపై కూడా ఎలాంటి చర్య తీసుకోమని హామీ ఇచ్చింది. రక్షణ మంత్రి, జనరల్ స్టాఫ్ చీఫ్ వాలెరీ గెరాసిమోవ్‌లను తొలగించాలని కూడా ప్రిగోజిన్ డిమాండ్ చేశారు. కానీ దీనిపై పుతిన్ కార్యాలయం స్పందించలేదు.
ప్రిగోజిన్ తిరుగుబాటు పుతిన్‌కు ఎదురుదెబ్బ: నిపుణులు
ప్రిగోజిన్ బెలారస్‌కు వెళ్లిపోతారని, తిరుగుబాటులో పాలుపంచుకోని, అలాగే వాగ్నర్ యోధులు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందాలపై సంతకం చేస్తారని అంగీకారం జరిగింది. అయితే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందనేది ఇప్పటికీ స్పష్టం తెలియదు. అయితే ప్రిగోజిన్ మాత్రం ఈ వ్యవహారాన్ని అంత ఈజీగా వదిలే ప్రసక్తి లేదని ఏబీసీ మీడియా సంస్థ యూరప్ బ్యూరో చీఫ్ స్టీవ్ కెనాన్ అంచనా వేశారు. అంతర్జాతీయ స్థాయిలో పుతిన్ నాయకత్వానికి ప్రిగోజిన్ తిరుగుబాటు ఎదురుదెబ్బ లాంటిదని నిపుణులు చెబుతున్నారు. వాగ్నెర్ ఫైటర్స్ మాస్కో నుంచి 200కిలోమీటర్ల దూరంలోకి చొచ్చుకొని రావడంతో పుతిన్ దుర్బల నాయకత్వం బయటపడిందని అంటున్నారు. రష్యా అధ్యక్షుడిగి ఇది ముగింపు మాత్రమే అన్నారు.